Prakash Raj: సనాతన ధర్మాన్ని కాపాడాటానికి పవన్ కల్యాణ్ ఏవరు..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్ మాట్లాడారని.. ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారని ప్రకాశ్ రాజ్ విమర్శించారు. ఎన్నికల్లో లేవనెత్తిన అంశాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పట్టించుకోకుండా సనాతన ధర్మం పేరుతో తను కాస్ట్యూమ్స్ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారని పవన్ ను ప్రశ్నించారు.

Prakash Raj vs Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ జాతీయ అవార్డులు, తాజా రాజకీయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల చెబుతున్న సనాతన ధర్మం.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశాలపై అడిగిన ప్రశ్నకు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. అసలు పవన్‌కి ఒక విజన్ అంటూ లేదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ ప్రజా సమస్యల గురించి ఎంతో స్పష్టంగా, ప్రామాణికంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడేమో సనాతన రక్షకుడినంటూ మతం రంగు పూసుకున్నారని విమర్శించారు. సనాతన ధర్మాన్ని కాపాడాటానికి పవన్ ఏవరు..? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలన్నారు.
అధికారంలో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న యువత నిరుద్యోగంతో బాధ పడుతున్నారని, రోడ్లు బాగాలేవనీ, ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయని.. అవినీతి పెరిగిపోయిందని తెలిపారు. వీటి గురించి పట్టించుకోవడం వదిలేసి సనాతన్ రక్షక్ అంటే ఎవడికి ఉపయోగం ? అని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. అయినా రోజుకో రకం దుస్తులు ధరించి పనిచేయడానికి ఇదేమీ సినిమా కాదు కదా? అని.. అసలు పవన్ కళ్యాణ్‌ని ఉప ముఖ్యమంత్రి హోదాలో చూడటమే నాకు చాలా ఇబ్బందిగా ఉందని అసహనం వెళ్లగక్కారు.
అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్ మాట్లాడారని.. ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారని ప్రకాశ్ రాజ్ విమర్శించారు. ఎన్నికల్లో లేవనెత్తిన అంశాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పట్టించుకోకుండా సనాతన ధర్మం పేరుతో తను కాస్ట్యూమ్స్ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారని పవన్ ను ప్రశ్నించారు. ఎన్నికల్లో పవన్ సనాతన ధర్మం, ఆలయాల పరిరక్షణ అంశాలతో ప్రచారం చేయలేదని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో.. వాటిని, ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే అధికారంలో ఎందుకు ఉండాలి?” అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
లడ్డూ కల్తీపై ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి
అలాగే తిరుపతి లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. తాను సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అది చాలా సున్నితమైన విషయమని, ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి, ఇలాంటి అంశాల గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ప్రజలను రెచ్చగొట్టడం.. లడ్డూకి మత రంగులు పూసి ముస్లింలను విలన్‌లుగా చిత్రీకరించడం చేశారని ప్రకాశ్ రాజ్ ధ్వజమెత్తారు. ఒకవేళ లడ్డూ తయారీలో నిజంగా కల్తీ జరిగి ఉంటే, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్‌రాజ్ సోషల్ మీడియా వేదికగా పోస్టులతో విరుచుకుపెట్టిన సంగతి తెలిసిందే. మరోసారి పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలు సహజంగానే పవన్ అభిమానులకు, జనసేన నేతలు, కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.