న్యూఢిల్లీ : అమెరికా సియాటెల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23) కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ నగర యంత్రాంగం ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరం అని, తాజా సెటిల్మెంట్‌తో ఆమె కుటుంబానికి కాస్తయినా ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నాం అని సియాటెల్ అటార్నీ తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలూ గతవారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేసినట్లుగా సమాచారం. అయితే, దీనిపై జాహ్నవి కుటుంబం పక్షాన అటార్నీ నుంచి ఇంతవరకూ స్పందన రాలేదు.
తాజా నిర్ణయం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాహ్నవి కేసులో వెలువడిన తాజా నిర్ణయం జాత్యాహంకారానికి చెంపపెట్టు వంటిదని.. జాతి ఆధారంగా మనిషి ప్రాణాలను తేలిగ్గా తీసుకుని వ్యాఖ్యానించిన అమెరికా పోలీసు అధికారికి గుణపాఠం అని వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు ఏం జరిగింది.. ?
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి (23) ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్‌లేక్ యూనియన్‌లోని నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. 2023 జనవరి 23న రాత్రి ఆమె సియటెల్ లో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి సంఘటన స్థలంలోనే మరణించింది. నిర్లక్ష్యంతో జాహ్నవి మృతికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవే.. ఘటన తర్వాత ఆమె మృతిపై జోకులు వేయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది.
ఆమె ఓ సాధారణ భారతీయ వ్యక్తి.. ఈ మరణానికి విలువ లేదు అని, 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది అంటూ జోక్ గా చెబుతూ నవ్వుతూ పోలీసు అధికారి కెవిన్ డవే అన్న మాటలు ఆయన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై అప్పట్లో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కెవిన్ డవే తీరుపై అమెరికాలోనూ విమర్శలు రావడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం 40కిలోమీటర్ల స్పీడ్ జోన్‌లో ఉంది. అయితే కెవిన్ డవే గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపి జాహ్నవిని ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రత ధాటికి జాహ్నవి 100 అడుగుల దూరం ఎగిరిపడింది. ఈ కేసులో చివరకు మూడేళ్ల తర్వాతైనా జాహ్నవి కుటుంబానికి న్యాయం దక్కిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Revanth Reddy Delhi Tour | ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబీజీ !
Gold Silver Rates Today | తగ్గిన బంగారం, వెండి ధరలు
