నా నరాల్లో పారేది రక్తం కాదు..డీజిల్ రా: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

ప్రైవేట్ బస్సుల టికెట్ ధరలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా నరాల్లో రక్తం కాదు.. డీజిల్" అంటూ బస్సు యజమానులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఒకే టికెట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రైవేటు బస్సు ఓనర్లపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్ టికెట్లల ధరలు తగ్గించి మార్కెట్‌ను నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రూ. 99కే టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అనంతపురం నుండి హైదరాబాద్‌కు కేవలం 300 రూపాయలకే ప్రయాణికులను ఎలా తీసుకెళ్తారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు బస్సు ఓనర్లు ఒకే టికెట్ విధానం అమలు చేయాలన్నారు.

నా ఒంట్లో ఉంది రక్తం కాదని, డీజిల్..రా..అని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే నెలాఖరులోపు బస్సు ధరలు ఒకే విధానం ఉండాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. రూల్స్ పక్కనబెట్టి, ఇష్టం వచ్చినట్లు బస్సులు నడిపితే సహించేది లేదని, ప్రయాణికులతో చెలగాటమాడితే రోడ్లపైనే అడ్డుకుంటానని ఆయన బహిరంగంగా సవాల్ విసిరారు. పరిస్థితులు బాగోలేవని, అనంతరం ప్రైవేటు బస్సు ఓనర్లు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ధరలు తగ్గిస్తుంటే బాధ కలుగుతోందన్నారు. బస్సు టికెట్ ధరలు ఓనర్ల కంట్రోల్‌లో ఉండాలన్నారు. ఇటూ, అటూ ఉంటే ఊరుకునేది లేదని ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ హెచ్చరించారు.

బస్సులు ఇంటి ముందు పెట్టుకుని టాక్స్ కడుతున్నా..

‘సౌత్ ఇండియాలోనే బస్ సర్వీస్ ల నిర్వహణలో నాకున్న అనుభవం, నెట్‌వర్క్ పెద్దదని, ఇప్పటికీ నా దగ్గర 34 బస్సులు ఉన్నాయని, కానీ ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకాలు, రవాణా రంగంలోని అస్తవ్యస్త విధానాల వల్ల ఆ 34 బస్సులను ఇంటి ముందే నిలబెట్టుకొని క్రమం తప్పకుండా టాక్స్ కడుతున్నానని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ విబేధాల మధ్య బస్సులు తిప్పలేక తీవ్రంగా నష్టపోయాను అని వాపోయారు. కనీసం బస్సు అద్దాలు తుడవడానికి కూడా చేతకానివాడు, రవాణా రంగం గురించి ఏమాత్రం అవగాహన లేనివాడు కూడా ఈ రోజు బస్సు ఓనర్ అయిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు అని ఘాటుగా విమర్శించారు.

మీ అవినీతి బాగోతం బయట పెడుతా..

రవాణా రంగంలో పారదర్శకత రావాలని, ప్రైవేట్ ట్రావెల్స్ వెంటనే తమ విధానాలను మార్చుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లగేజ్ రవాణా చేస్తూ, ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న జబ్బర్, రెడ్ బస్, కిరణ్ ట్రావెల్స్ వంటి ప్రముఖ సంస్థల యాజమాన్యాల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బస్సు యాజమాన్యాలు చేస్తున్న అక్రమాలన్నీ తనకు వేలిముద్రలతో సహా తెలుసని జేసీ వ్యాఖ్యానించారు. టాక్స్ సరిగ్గా కట్టకుండా, బస్సులను అక్రమంగా తిప్పుతున్నారని ఆరోపించారు.

హైదరాబాద్‌లోని బస్సు యజమానులు అక్కడ ఉన్న ఆర్‌టీవోలు, బ్రేక్ ఇన్‌స్పెక్టర్లతో కూర్చొని కుమ్మక్కవుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రవాణా శాఖలో జరుగుతున్న ఈ అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలన్నీ త్వరలోనే మీడియా ముందుకు తీసుకొస్తానని చెప్పారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులందరూ వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని, రూట్ ఆధారంగా ఒకే రేటు నిర్ణయించాలని స్పష్టం చేశారు.

Latest News