Site icon vidhaatha

Water Politics | రాజకీయాల కోసమే నీటి పంచాయితీ.. : ఆలోచనాపరుల వేదిక సభ్యులు

Water Politics | అరవై సంవత్సరాలుగా కృష్ణా నదీ జలాల పంపకం, వాడకం, రాయలసీమలో సాగునీటి పారుదల అభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, అలాగే, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నీటి పంపకాల అంశంపై ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి, కేవలం రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విషయాన్ని అందరూ గమనిస్తున్నారని రిటైర్డ్ ఐపీఎస్ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ అంశాలపై రెండు రాష్ట్రాల ప్రజలకు స్పష్టత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆలోచనాపరుల వేదిక నిర్వహించిన మీడియా సమావేశంలో రైతు సేవా సంస్థ అధ్యక్షుడు అక్కినేని భవానీ ప్రసాద్, నీటి పారుదల రంగం విశ్లేషకులు టీ.లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు.

కృష్ణా నదిలో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి? ఎన్ని సముద్రం పాలవుతున్నాయి? ఎన్ని నీళ్ళు వాడుకునే సామర్థ్యం రెండు రాష్ట్రాలకు ఉన్నది? ఏ మేరకు ఆ సామర్థ్యన్ని వినియోగించుకోగలుగుతున్నాం? అనేవి ఆలోచించాలన్నారు. 30 ఏళ్ళ క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులు, ఇవాళ ఏ స్థితిలో ఉన్నాయో చూడాలని చెప్పారు. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బంతా “డెడ్ ఇన్వెస్ట్‌మెంట్‌’గా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏ కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఈ ప్రాజెక్టులు కట్టినట్టు? ఏ ప్రాజెక్టులో ఇంకా ఎన్ని నిర్మాణ పనులు ఆగిపోయాయి? వాటికి అయ్యే ఖర్చెంత? ఇప్పటి వరకు పెట్టిన ఖర్చుతో పోల్చితే, ఇంకా పెట్టాల్సిన ఖర్చు శాతమెంత? ఆ కాస్త ఖర్చు పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టిన పదుల వేల కోట్ల రూపాయల ‘డెడ్ ఇన్వెస్ట్‌మెంట్‌’పై కడుతున్న వడ్డీలు ఎంత నష్టం చేస్తాయి? అనే విషయాల మీద ప్రజలకు స్పష్టత కల్పించడం కోసం ప్రాజెక్టుల సందర్శనకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం’ అని వివరించారు.

రాజకీయ పార్టీలు పొద్దుపోకపోతే, ఏ ఇష్యూ లేకపోతే, నీళ్ళ సమస్యను ఒక ఇష్యూగా తీసుకుని, హోరెత్తించే ప్రకటనల ఉద్యమాలు చేస్తుంటాయని విమర్శించారు. ఆ ప్రకటనలను నమ్మొద్దని, వాస్తవాలేంటో తరచిచూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అపరిష్కృతంగా ఉన్న నీటి సమస్యలను పరిష్కరించుకోవడంలో రాజకీయ పరిపక్వత ఉంటుంది తప్ప కేవలం ప్రకటనలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, తొడలు కొట్టడాలు, మీసాలు మేలేయడాలు, సవాళ్ళు విసరడాళ్ళు, అనేది నీటిపారుదల రంగం బాగులు, రైతుల బాగులు ఉద్దేశించే పనులు కావని విమర్శించారు. కేవలం కాంట్రాక్టర్ల చొరవతో, అవసరం లేని పనికిమాలిన ప్రాజెక్టులను డిజైన్ చేయటం, వాటికి అనుమతులివ్వడం, హుటాహుటిన నిధులు చెల్లించడం.. గతంలో చూశాం, ఇప్పుడు చూస్తున్నామన్నారు. అన్ని అంశాలను నిష్పాక్షపాతంగా అధ్యయనం చేసి,రాజకీయాలకు అతీతంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా అగస్టు 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు పలు ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Banakacharla | ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఉచిత పథకాలకంటే డేంజర్‌.. బనకచర్ల!
Banakacharla Project | బనకచర్ల చుట్టూ రెండు రాష్ట్రాల రాజకీయాలు!

Exit mobile version