Ethipothala Falls | మహా అందం..మాచర్ల జలపాతం..పెరిగిన పర్యాటకుల తాకిడి

మాచర్ల జలపాతం వరద నీటితో పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. భారీ వర్షాలతో అందాలు మరింత అద్భుతంగా మారాయి.

Ethipothala Falls | మహా అందం..మాచర్ల జలపాతం..పెరిగిన పర్యాటకుల తాకిడి

అమరావతి : ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్లలో ఎత్తిపోత‌ల జ‌ల‌పాతానికి వ‌ర‌ద‌ నీరు కొత్త అందాలను అద్దింది. భారీ వర్షాలతో ఎత్తిపోతల జల‌పాతానికి జలకళ సంతరించుకోగా…కొండల మీదుగా 70 అడుగుల ఎత్తు నుంచి దిగువకు జాలువారుతున్న ఈ జలపాతం అందాలు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. విశాలంగా పరచుకున్న పలు కొండల మీదుగా కృష్ణా నది ఉప నది చంద్రవంక నది వరద నీరు జాలు వారడం మాచర్ల జల పాతం ప్రత్యేకత.

చాల వరకు జలపాతాలు ఒకటి రెండు పాయలుగానే దిగువకు ప్రవహిస్తుంటాయి. అయితే మాచర్ల జలపాతం మాత్రం విశాలమైన కొండల మీదుగా భారీగా ఉరకలెత్తుతున్న వరద ప్రవాహంతో కనువిందు చేస్తుంటుంది. ప్రస్తుతం భారీ వర్షాలకు పెరిగిన వరద ఉదృతితో మాచర్ల జలపాతం పరవళ్లు తొక్కుతుండగా..జలపాతం అందాలు చూసేందుకు ప‌ర్యాట‌కులు పోటెత్తారు. మాచర్ల జలపాతం అందాలు చూసిన వారు…ఈ జలపాతం విదేశీ ప్రాంతాల్లోనో..సినిమాల్లోనో చూసిన భారీ జలపాతాలను తలపిస్తూ ఆకట్టుకుంటుందని సంబర పడుతున్నారు.

మాచర్ల జలపాతాన్ని చూసేందుకు ఆంధ్ర ప్రాంతం వారితో పాటు తెలంగాణ నుంచి నాగార్జున సాగర్ నుంచి మాచర్ల మార్గంలో కూడా పర్యాటకులు వెలుతున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి 11కిలోమీటర్ల దూరంలోని తాళ్లపల్లి వద్ధ ఉన్న మాచర్ల ఎత్తిపోతల జలపాతాన్ని చూసేందుకు వెలుతున్నారు. జలపాతం వద్ధ ఫోటోలు, వీడియోలతో సందడి చేస్తున్నారు.