Andhra Murder Case : పొట్టిగా ఉన్నాడని.. బావన చంపిన బామ్మర్ధి
పొట్టిగా ఉన్నాడన్న ఒకే ఒక కారణంతో.. బాపట్లకు చెందిన యువకుడు కుర్ర నాగ గణేష్‌ను అతని బావమరిది దుర్గారావు దారుణంగా హత్య చేశాడు. పెళ్లైన 10 రోజులకే ఈ ఘటన జరిగింది.

విధాత : తన బావ పొట్టిగా ఉన్నాడన్న కారణంతో ఓ వ్యక్తి తన సోదరి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. బాపట్లకు చెందిన కుర్ర నాగ గణేష్ గుంటూరులో విద్యుత్తు శాఖలో షిప్టు ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. పెళ్లి సంబంధంలో భాగంగా అతని కుటుంబ సభ్యులు దూరపు బంధువలైన తెనాలి సమీపంలోని కొలుకలూరుకు చెందిన కీర్తి అంజనాదేవి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లారు. అక్కడు యువతీ, యువకుడు పరస్పరం ఇష్టపడినా..కీర్తి తల్లిదండ్రులు మాత్రం గణేష్ అమ్మాయి కంటే పొట్టిగా ఉన్నాడని వారి పెళ్లికి నిరాకరించారు. పెళ్లి చూపుల సందర్బంగా కీర్తి, గణేష్ లు ఇద్దరు కూడా తమ ఫోన్ నెంబర్లు పరస్పరం ఇచ్చుకోగా..వారు తరచు చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు.
గణేష్, కీర్తిలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని..ఎవరికి చెప్పకుండా పారిపోయి అమరావతి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారిద్దరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో తమ పెద్దల నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేయగా..పోలీసులు రెండుకుటుంబాల పెద్దలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అదే సమయంలో కీర్తీ సోదరుడు దుర్గారావు మాత్రం తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నావని..నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. అయితే అంతా అతని బెదిరింపులు ఏదో అవేశంలో చేసినవేనని తేలిగ్గా తీసుకున్నారు.
రిసెప్షన్ సన్నాహాల్లో ఉండగా హత్య
తన పెళ్లి రహస్యంగా జరిగిపోయినందునా..బంధుమిత్రులను పిలిచి రిసెప్షన్ చేసుకోవాలని భావించిన గణేష్ తమ బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని మిత్రుడితో కలిసి బైక్ పై ఇంటికి బయలు దేరాడు. దారి మధ్యలో గణేష్ ను బావమర్ధి దుర్గారావు అడ్డగించాడు. మరో ఇద్దరితో కలిసి కత్తులతో బావ గణేష్ పై దాడి చేసి పొడిచి చంపాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దుర్గారావును అరెస్టు చేశారు. కేవలం తన బావ గణేష్ పొట్టిగా ఉన్నాడన్న కారణంతో తమకు ఈ పెళ్లి ఇష్టం లేక అతడిని హత్య చేశామంటూ దుర్గారావు వెల్లడించడం అందరిని విస్మయానికి గురి చేసింది. పొట్టిగా ఉన్నాడన్న కారణంతో బావను హత్య చేసి..చెల్లెలి తాళి తెంచిన అన్న దుర్గారావు నిర్వాకంపై అందరు అశ్చర్యపోయారు. పెళ్లయిన పది రోజులకే తమ కుమారుడు హత్యకు గురవ్వడంతో గణేష్ తల్లిదండ్రులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు.