Fire Accident | కోర్బా – విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. మూడు బోగీలు దగ్ధం
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగి మూడు బోగీలు దగ్ధమయ్యాయి. ఛత్తీస్ గఢ్ కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ ప్రెస్ (18517) రైలు బోగీల్లో ఈ మంటలు వ్యాపించాయి.

ప్రయాణికులు సురక్షితం
విధాత, హైదరాబాద్ : విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగి మూడు బోగీలు దగ్ధమయ్యాయి. ఛత్తీస్ గఢ్ కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ ప్రెస్ (18517) రైలు బోగీల్లో ఈ మంటలు వ్యాపించాయి. స్టేషన్‌లోని 4వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిపిన ఈ రైలులోని ఏసీ బోగిల్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలు మూడు ఏసీ బోగీలకు వ్యాపించగా బీ 7, బీ6 బోగీలు పూర్తిగా, ఎం 1బోగి పాక్షికంగా దగ్ధమయ్యాయి. బీ7 బోగీలోని మరుగుదొడ్డిలో షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. ప్రమాద సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి ముందే రైలులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోయారు.
రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఈ రైలు మరికొద్ధి సేపట్లో తిరుపతికి బయలుదేరాల్సివుంది. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలులో అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత డీఆర్ఎంతో ఫోన్‌లో ప్రమాదానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని విశాఖ సంయుక్త సీపీ ఫకీరప్ప తెలిపారు. నేడు ఉదయం 10 గంటలకు మంటలు చెలరేగాయన్నారు. వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారని తెలిపారు. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలార్పారని చెప్పారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరు చేసి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాద ఘటనపై రైల్వే సిబ్బంది విచారణ, సహాయక చర్యలు చేపట్టారు.