మంత్రి లోకేశ్ చొరవ..పునర్వికకు పునర్జన్మ..!
స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేశ్ చొరవతో రూ.16 కోట్ల జోల్జెన్స్మా ఇంజెక్షన్ అందించారు. కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
విధాత, హైదరాబాద్: స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను వైద్యులు ఇచ్చారు. జోల్ జెన్ స్మా ఇంజెక్షన్‌ను మంత్రి నారా లోకేశ్ విదేశాల నుంచి తెప్పించారు. ఆయన సమక్షంలోనే హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పునర్వికకు వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ సందర్బంగా చిన్నారి కుటుంబ సభ్యులు మంత్రి లోకేశ్, వైద్యులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి లోకేష్.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఏడుస్తుండటంతో కొద్దిసేపు ఎత్తుకుని లాలించారు. చిన్నారిని కాపాడటం తన బాధ్యత అని, అన్ని విధాలా అండగా ఉంటానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. లక్షలాది మంది ఆశీస్సులతో పునర్విక ప్రాణాలు కాపాడుకోగలిగామని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.
రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఒక్కటే మార్గం
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాది వయసున్న పునర్విక ప్రాణాంతకమైన వెన్నెముక కండరాల క్షీణత అనే వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి తండ్రి జంపాల మంగళ సురేష్ కుమార్ క్షవర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పునర్విక జన్మించి ఆరు నెలలలైనా శరీరం కదిలించకపోవడంతో కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కర్నూలు వైద్యుల సలహా మేరకు చిన్నారిని హైదరాబాద్ లోని రెయిన్ బో చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. పునర్వికకు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ సోకిందని, చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం రూ.16 కోట్ల ఖరీదైన జోల్ జెన్ స్మా అనే ఒకసారి మాత్రమే ఇచ్చే జీన్ థెరపీ ఇంజెక్షన్ అని వైద్యులు తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్
ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు సురేష్ కుమార్, పుష్పావతి ఈ ఏడాది జనవరి నుంచి దాతల సాయం కోరారు. పునర్వికను కాపాడాలంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిఒక్కరూ స్పందించి మానవత్వం చాటుకున్నారు. కొన్ని నెలల క్రితం మీడియా- సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. సేవ్ పునర్విక.. పునర్వికను కాపాడుకుందాం.. అంటూ లక్షల హృదయాలు స్పందించాయి. చేతనైన సాయం చేశాయి. చేయలేని వారు ప్రార్థించారు. ఇంజెక్షన్ కోసం వెల్లువలా విరాళాలు వచ్చాయి. ఫిబ్రవరి నాటికి విరాళాల ద్వారా రూ.10 కోట్ల వరకు సమకూరాయి. సాయం కోసం ఎక్స్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను విజ్ఞప్తి చేశారు. ఆపదలో అండగా నిలిచే మంత్రి నారా లోకేష్.. పునర్విక ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే స్పందించారు. పునర్విక బాధ్యత తీసుకుంటానని, చిన్నారిని కాపాడతామని హామీ ఇచ్చారు.
ఇంజెక్షన్ కోసం మంత్రి లోకేష్ నిరంతర పర్యవేక్షణ
అమెరికా నుంచి ఖరీదైన ఇంజెక్షన్ ను త్వరితగతిన హైదరాబాద్‌కు రప్పించే పనిని తన సిబ్బంది ద్వారా నిరంతరం లోకేష్ పర్యవేక్షించారు. ప్రముఖ ఔషధ కంపెనీ నోవార్టీస్, రెయిన్ బో ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులను సమన్వయ పరిచారు. వైద్య పత్రాలు, ఒప్పందాలు పూర్తిచేయడం, ప్రభుత్వ ధృవపత్రాలు, వినతులు తయారీ, చెల్లింపులు, రవాణా అంశాల్లో సహాయ సహకారాలు అందించారు. పునర్విక చికిత్సలో ఎలాంటి ఆలస్యం జరగకుండా మంత్రి లోకేష్ చేసిన కృషితో నిండు ప్రాణాలు నిలిచాయి.
ఇది పునర్జన్మే..
తాము పునర్వికకు జన్మనిస్తే.. మంత్రి నారా లోకేష్, మానవతాహృదయాల స్పందనతో పునర్జన్మ లభించిందని తల్లిదండ్రులు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ చేసిన సాయాన్ని జీవింతాంతం గుర్తుపెట్టుకుంటామని భావోద్వేగంతో చెప్పారు. తమ చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడేందుకు సహాయం అందించడమే కాకుండా, భవిష్యత్తులోనూ అన్ని విధాలా అండగా ఉంటానని లోకేష్ భరోసా ఇచ్చారని తెలిపారు. వైద్యం అందించిన డాక్టర్లు, స్పందించిన ప్రతి హృదయానికి, ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ, సాయం అందించిన ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు తెలియజేశారు పునర్విక తల్లిదండ్రులు.
ఇవి కూడా చదవండి :
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ద్రోహం : సీఎం చంద్రబాబు
భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోదీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram