Nara Lokesh to Jessy | చిట్టి తల్లీ, నిశ్చింతగా చదువుకో: జెస్సీకి భరోసా ఇచ్చిన నారా లోకేష్

కేజీబీవీ సీటు రాకపోవడంతో పత్తి పొలాల్లో కూలీగా మారిన జెస్సీ అనే బాలికకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్​ భరోసా ఇచ్చారు. “చిట్టి తల్లీ, నిశ్చింతగా చదువుకో” అంటూ ఆమెకు సీటు కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు.

Nara Lokesh to Jessy | చిట్టి తల్లీ, నిశ్చింతగా చదువుకో: జెస్సీకి భరోసా ఇచ్చిన నారా లోకేష్ Screenshot

తాడేపల్లి:

Nara Lokesh to Jessy | చదువుకోవాలని తహతహలాడుతున్న బాలిక జెస్సీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కదిలించింది. పాఠశాలలో సీటు రాకపోవడంతో పత్తి పొలాల్లో కూలీగా మారిన బాలిక కథ ఆయన దృష్టికి రావడంతో వెంటనే స్పందించి ఆమెకు చదువుకు హామీ ఇచ్చారు.

మంత్రాలయం మండలం బూదూరుకు చెందిన జెస్సీ 5వ తరగతి వరకు తన గ్రామంలోనే చదివినా, అక్కడ పైతరగతులు లేకపోవడంతో చిలకలడోణలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో సీటు కోసం దరఖాస్తు చేసింది. అయితే సీటు రాకపోవడంతో కుటుంబానికి భారం కావద్దని తల్లిదండ్రులతో కలిసి పత్తి పొలాల్లో కూలీ పనులు చేస్తోంది. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి నారా లోకేష్, “చిట్టి తల్లీ, నిశ్చింతగా చదువుకో. నీకు కేజీబీవీలో సీటు ఇప్పిస్తాను. పుస్తకాలు పట్టాల్సిన చిన్నిచేతులు పత్తి పొలాల్లో మగ్గిపోవడం చాలా బాధాకరం” అని హామీ ఇచ్చారు.

ఇప్పటికే అధికారులతో మాట్లాడి జెస్సీకి సీటు ఖరారు చేశానని లోకేష్ తెలిపారు. “ప్రభుత్వ పాఠశాలలు మనం నమ్మే విద్యామందిరాలు. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత మాది. యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, భోజనం—అన్నీ ఉచితంగా ఇస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలను చదువుకు దూరం చేయొద్దు” అని విజ్ఞప్తి చేశారు.

మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన మీనిగ కుమార్, సంతోషమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు ప్రభుత్వ హాస్టల్‌లో 7వ తరగతి చదువుతుండగా, చిన్న కుమార్తె 4వ తరగతి చదువుతోంది. రెండో కుమార్తె జెస్సీ మాత్రం సీటు రాకపోవడంతో కూలీ పనులకు వెళ్ళాల్సి వచ్చింది. కుటుంబ పరిస్థితి దారుణంగా ఉండటంతో జెస్సీ చదువుకోవాలన్న కల వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జెస్సీ భవిష్యత్‌కు లోకేష్ భరోసా ఇచ్చి తన జీవితాన్ని ఒక మలుపు తిప్పారు.

“పిల్లల భవిష్యత్‌ కోసం బడికంటే సురక్షిత ప్రదేశం మరొకటి లేదు. జెస్సీ లాంటి పిల్లలు చదువుతో ఎదిగి సమాజానికి తోడ్పడాలి. పిల్లలను విద్యకు దూరం చేయొద్దని తల్లిదండ్రులను వేడుకుంటున్నాను అని లోకేష్ సోషల్​ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసారు.