Visakha MLC by Election | విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్డీఏ కూటమి దూరం
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్డీఏ కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించింది. టిడిపి అధినేత సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ నేతలతో చర్చించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు

విధాత: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్డీఏ కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించింది. టిడిపి అధినేత సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ నేతలతో చర్చించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. తొలుత ఈ స్థానంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టిడిపి నేత బైర దిలీప్ చక్రవర్తిని రంగంలో దించాలని భావించారు. బలాబలాల విశ్లేషణ తో పాటు వైసీపీ క్యాంపు రాజకీయాలకు దిగడంతో గెలుపు ప్రయత్నాలు అనవసర ప్రయాసగా మిగిలిపోతాయని గ్రహించి పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.
ఈ మేరకు ఆయన నిన్ననే తన నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 530 కి పైగా ఓట్లు ఉన్నాయని ఎన్డీఏ కూటమి కంటే 300 కు పైగా ఓట్లు తమకు అధికంగా ఉన్నాయని అలాంటప్పుడు ఎన్డీఏ కూటమి పోటీ చేయడం ఎందుకని బొత్స నిలదీశారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో విశ్లేషణ అనంతరం చంద్రబాబు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని పోటీకి నిలపకూడదని నిర్ణయించారు. కాగా ఈరోజు నామినేషన్ లో ఉపసంహరణ ప్రక్రియ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ తో పాటు మరొక ఇండిపెండెంట్ అభ్యర్థి షేక్ సఫీ బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్న పక్షంలో ఎమ్మెల్సీగా బొత్స ఎన్నిక ఏకగ్రీవం కానుంది.