R.Narayana Murthy : జగన్ ఎవరినీ అవమానించలేదు
నారాయణమూర్తి: జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం కాలంలో ఎవరినీ అవమానించలేదని, బాలకృష్ణ వ్యాఖ్యలపై clarify చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో సినీ పరిశ్రమకు చెందినవారిని ఎవరినీ అవమానించలేదని ప్రముఖ నటులు, దర్శకులు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన హిందూపురం ఎమ్మెల్యే, నటులు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయమై నారాయణ మూర్తి శనివారం స్పందించారు. అప్పట్లో జగన్ ను కలిసినవాళ్లలో తాను కూడా ఉన్నానని ఆయన గుర్తు చేశారు.సినిమా వాళ్లకు జగన్ ఎంతో గౌరవం ఇచ్చారని ఆయన అన్నారు.చిరంజీవిని అవమానించారనే ప్రచారం తప్పు అని ఆయన తెలిపారు.చిరంజీవి చొరవ వల్లే సమస్య పరిష్కారమైందని ఆయన వివరించారు. సినీపరిశ్రమ పెద్దగా చిరంజీవి జగన్ తో మాట్లాడారని నారాయణమూర్తి చెప్పారు.బాలకృష్ణ వ్యాఖ్యలపై తాను మాట్లాడదల్చుకోలేదన్నారు.సామాన్యుడికి వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో సినీ రంగ పరిశ్రమలో సమస్యలపై చిరంజీవి చర్చించారు. ఆ తర్వాత సినీ రంగ సమస్యలపై సినీ ప్రముఖులతో చర్చించేందుకు సీఎం జగన్ సమయం కేటాయించారు. ఈ సమావేశానికి బాలకృష్ణకు ఆహ్వానించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని చిరంజీవి వివరించారు. అయితే ఈ సమావేశంలో సినీ ప్రముఖులను జగన్ అవమానించారని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ విషయమై మాట్లాడారు. ఈ విషయమై బాలకృష్ణ జోక్యం చేసుకున్నారు. ఆ సమయంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.