Narsapur Express | నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీ యత్నం.. ఆర్ఫీఎఫ్ సిబ్బంది రాకతో పరారైన దొంగలు
నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో దొంగలు చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. పల్నాడు జిల్లా మాచర్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం అర్థరాత్రి కొంతమంది దుండగులు చైన్ లాగీ రైలును ఆపారు.

విధాత, హైదరాబాద్ : నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో దొంగలు చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. పల్నాడు జిల్లా మాచర్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం అర్థరాత్రి కొంతమంది దుండగులు చైన్ లాగీ రైలును ఆపారు. బీ-5, ఎస్-10, ఎస్-13 బోగీల్లోని ప్రయాణికుల వద్ద ఆభరణాలు చోరీ చేసేందుకు ప్రయత్నించారు. దొంగలను అడ్డుకునే క్రమంలో ఓ మహిళ గట్టిగా కేకలు వేసింది.
వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తం కావడంతో దొంగలు పరారయ్యారు. ఆర్పీఎఫ్ పోలీసులను చూసిన దొంగలు రైలు దిగి పారిపోతూ ప్రయాణికులపైన, ఆర్పీఎఫ్ పోలీసులపైన రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రైలు నర్సాపూర్ నుంచి లింగంపల్లి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దోపిడి యత్నం కారణంగా నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు 30 నిమిషాలపాటు నడికుడి-పొందుగుల రైల్వేస్టేషన్ల మధ్య నిలిచిపోయింది.