ఆప‌త్కాలంలో అండ‌గా విశాఖ స్టీల్ ప్లాంట్

ఆక్సిజన్ ఉత్పత్తికి భంగం కలగకూడదనే స‌మ్మె వాయిదా విధాత‌: దేశంలో క‌రోనా మ‌హోగ్ర‌రూపం రూపం దాల్చ‌డంతో ఆక్సిజన్ వినియోగం బాగా పెరిగింది. దీంతో ప్రాణ‌వాయువుకు కొర‌త ఏర్ప‌డింది. ఉత్పత్తి అనివార్య‌మైంది. ఈ నేప‌థ్యంలో అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌న్నింటినీ వినియోగించుకోవాల్సి వ‌స్తోంది. అయినా స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. ఇలాంటి ఆప‌త్కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెను సైతం వాయిదా వేసుకొని కోవిడ్ బాధితుల‌కు మేమున్నామంటూ ముందుకు వ‌చ్చారు. ఇప్పటికే ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తిని చేసి దేశంలోని ప‌లు రాష్ట్రాలకు […]

  • Publish Date - May 6, 2021 / 10:23 AM IST

ఆక్సిజన్ ఉత్పత్తికి భంగం కలగకూడదనే స‌మ్మె వాయిదా

విధాత‌: దేశంలో క‌రోనా మ‌హోగ్ర‌రూపం రూపం దాల్చ‌డంతో ఆక్సిజన్ వినియోగం బాగా పెరిగింది. దీంతో ప్రాణ‌వాయువుకు కొర‌త ఏర్ప‌డింది. ఉత్పత్తి అనివార్య‌మైంది. ఈ నేప‌థ్యంలో అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌న్నింటినీ వినియోగించుకోవాల్సి వ‌స్తోంది. అయినా స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. ఇలాంటి ఆప‌త్కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెను సైతం వాయిదా వేసుకొని కోవిడ్ బాధితుల‌కు మేమున్నామంటూ ముందుకు వ‌చ్చారు.

ఇప్పటికే ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తిని చేసి దేశంలోని ప‌లు రాష్ట్రాలకు సరఫరా చేస్తూ కోవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ను సరఫరా చేస్తోంది. కరోనా రోగులకు ఎంతో అవసరమైన, వారి ప్రాణాలను కాపాడే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తయారు చేస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రాణాలను నిలబెడుతున్న లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ముందుంటోంది.

కరోనా రక్కసి మనిషి ఊపిరి తీస్తున్న వేళ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాతో ఊపిరి పోస్తోంది. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ఇప్పటి వరకు ఎవరి ఊహకు అందని రీతిలో 11 వేల 900 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. ఇక్కడ ఐదు ఆక్సిజన్‌ యూనిట్లు ఉండగా.. అన్నింటిలోనూ పూరిస్థాయిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్నారు.

గత నెల 13 నుంచి ఇప్పటి వరకు 3,050 టన్నుల ఆక్సిజన్‌ను క్రయోజనిక్‌ ట్యాంకర్ల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. కొత్తగా నిర్మించిన మరో రెండు యూనిట్లు కూడా త్వరలో ఆపరేషన్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. వాటి ద్వారా అదనంగా రోజుకు 100 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేయగలుగుతామని స్టీల్‌ప్లాంటు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

కొన్ని రోజుల ముందు పరిస్థితి చూస్తే.. విశాఖ ఆంధ్రల హక్కు అంటూ నినాదం మారు మోగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవైటేవీకరిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. స్వయంగా లోక్ సభలోనే మంత్రి సమాధానం ఇవ్వడంతో విశాఖ ప్రైవేటు పరం అవ్వడమనేది లాంఛనమే అయ్యింది. దీంతో 32 మంది తమ ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయడాన్ని అంగీకరించం అంటూ విశాఖ ఉక్కు ఉద్యమం మొదలైంది.

ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బంద్, భారత్ బంద్ కు కూడా విశాఖ స్టీల్ కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చారు. ఆమరణ దీక్షలు, రిలే నిరహారా దీక్షలు, బీచ్ వాక్, పాద యాత్రలు ఇలా వివిధ రూపాల్లో తమ నిరసన తెలిపారు కార్మికులు. అయినా కేంద్రం వెనక్కు తగ్గకపోవడంతో కార్మిక సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వేతనాల పెంపు డిమాండ్ తో పాటు, ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలుపు ఇచ్చాయి.

ప్రస్తతుం పరిస్థితి పూర్తిగా మారింది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోంది. రోజు రోజుకూ కేసులు, మరణాలు రెట్టింపు అవుతున్నాయి. చాలామంది ఆక్సిజన్ అందకే మరణించడం ఆందోళన పెంచుతోంది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రాణదాతగా ముందుకు వస్తోంది. ఆక్సిజన్ కొరత లేకుండా దేశ వ్యాప్తంగా అందరికీ అందించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

ఇప్పటికే రికార్డు స్థాయిలో విశాఖ నుంచి ఆక్సిజన్ సరఫారా అవుతోంది. ఇప్పటికే సుమారు 12 వేల టన్నుల ఆక్సిజన్ ను సరఫారా చేసింది. ఇలాంటి కష్ట కాలంలో తాము సమ్మె చేయడం సరైంది కాదని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆక్సిజన్ ఉత్పత్తికి విఘాతం కలుగ కూడదని సమ్మెను వాయిదా వేసుకున్నాయి కార్మిక సంఘాలు.