ఏపీలో అధికారం.. టీడీపీ, జనసేనదే!

- స్పష్టం చేస్తున్న తాజా పోల్ సర్వేలు
- అధికార వైసీపీకి 43 శాతం మొగ్గు
- టీడీపీ, జనసేన కూటమికి 54 %
- ఇతరులు, బీజేపీ పోటీ నామమాత్రం
- బాబు అరెస్టుతో పెరిగిన సానుభూతి
- బీజేపీ దన్నుతోనే చంద్రబాబు అరెస్ట్
- వైసీపీ కుమ్మక్కయిందన్న అభిప్రాయం
- తటస్థులంతా టీడీపీ-జనసేనవైపే?
- ఈ కూటమికి భారీగా బీసీ, ఎస్సీల మద్దతు
- క్రిస్టియన్, ఎస్టీ ఓటర్లు జగన్ వైపే!
(విధాత ప్రత్యేక ప్రతినిధి)
2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లలో జనసేన-టీడీపీ కూటమి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేలు పేర్కొంటున్నాయి. వైనాట్ 175 అన్న జగన్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఎదురుగాలి వీసే పరిస్థితులు ఉంటాయని అంచనాలు వెలువడుతున్నాయి. టీడీపీ-జనసేన-వామపక్షాల కూటమితో వైసీపీ రెండోసారి అధికారం ఆశలు గల్లంతేనని అంటున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత ఏపీలో జనం మూడ్‌లో భారీ తేడా వచ్చిందని, తటస్థులు, మేధావులు బీజీపీ-వైసీపీ కలిసిపోయి బాబును అరెస్టు చేశారనే అభిప్రాయానికి వచ్చారని తెలుస్తున్నది.

ఆత్మసాక్షి సర్వేలో జగన్ పార్టీకి షాక్
సెప్టెంబర్ 30న శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ (ఎస్‌ఏజీ) నిర్వహించిన సర్వేలో వైసీపీ దిమ్మదిరిగే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరికి వారు విడివిడిగా పోటీ చేసినా కూడా వైసీపీ ఓటు బ్యాంకు 41.5 శాతానికి మించదని తేలింది. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా 44 శాతం ఓట్లు వస్తాయని, జనసేనకు 10 శాతం ఓట్లు, బీజేపీకి 0.5 శాతం, ఇతరులకు 3 శాతం, గుంభనంగా తమకు నచ్చిన పార్టీకి ఓటేసేవారి (సైలెంట్ ఓటుబ్యాంకు) 1 శాతంగా ఉన్నట్లు వెల్లడయింది. ఆత్మసాక్షి సర్వే సంస్థ చంద్రబాబు అరెస్టుకు ముందు, అరెస్టు అయిన తరువాత రెండు విడుతలుగా ఏపీలోని 13 జిల్లాల్లో సర్వే చేసింది. రెండో విడత సర్వే సెప్టెంబర్ 12 నుంచి 30వ తేదీ మధ్య చేసినట్లు వెల్లడించింది. 13 జిల్లాలో మొత్తం 65,750 మంది ఓటర్లను ర్యాండమ్‌గా సర్వే చేసినట్లు తెలిపింది.
టీడీపీ, జనసేన కలిస్తే…
రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ శ్రేణులు కూడా పవన్ వారాహి యాత్రకు మద్దతిస్తూ, ఎక్కడిక్కడ సభల్లో పాల్గొంటున్నాయి. టీడీపీ, జనసేన కలిస్తే 50 శాతం ఓట్లు ఖాయంగా పడతాయని, సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ 2 శాతం కూడా టీడీపీ కూటమికే మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. వామపక్షాలు, ఇతరులు కలిపి 4.5 శాతం ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి.

టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే..
ఇదే సర్వేలో మరో ఆశ్చర్యకరమైన అంశం వెలుగు చూసింది. టీడీపీ, జనసేన, బిజేపీ కలిసి పోటీ చేస్తే మాత్రం జనం తిరిగి జగన్ పార్టీకే పట్టం కడతారని వెల్లడైంది. మూడు పార్టీలకు కలిపి 43 శాతం ఓట్లు పడతాయని, వైసీపీకి మాత్రం 47 శాతం మద్దతు పలుకుతారని తేలింది.

టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిస్తే..
టీడీపీతో జనసేన జత కడితేనే అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని సర్వేలో వెల్లడైంది. దీనికి అదనంగా వామపక్షాలు కూడా తోడైతే మరిన్ని సీట్లు పెరుగుతాయని తేలింది. టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిస్తే మొత్తం 54 శాతం ఓటు బ్యాంకుతో అధికారం ఖాయమని ఈ సర్వేలో వెల్లడైంది. వామపక్ష పార్టీల్లో ఒకటైన సీపీఐ, టీడీపీ, జనసేన కూటమితో కలిసి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఇప్పటికే స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు లేకుంటే తాము కూడా కలిసివస్తామని సీపీఎం నాయకులు కూడా ప్రకటించారు. వైపీపీకి మాత్రం 43 శాతం ఓట్లు పడతాయని తేలింది. ఈ పర్సెంటేజీని బట్టి టీడీపీ, జనసేన, వామపక్షాల కూటమి 110 నుంచి 130 ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉంది. వైసీపీ 40 నుంచి 50 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు.

2019 ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతాయా?
2019 ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ 23, జనసేన ఒక స్థానాన్ని గెలుచుకోగా, బీజేపీ, కాంగ్రెస్‌లు కనీసం బోణీ కూడా చేయలేక చతికిలపడ్డాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 49.95 శాతం ఓట్లు రాబట్టింది. తెలుగుదేశం మాత్రం 39.17 శాతం ఓట్లకే పరిమితమైంది. జనసేన 5.33 శాతం ఓట్లు సాధించగా, బీజేపీ.. నోటా (1.28 శాతం) కంటే తక్కువగా 0.84 శాతం ఓట్లు తెచ్చుకుంది. ప్రస్తుత సర్వేల్లో ఈ ఓట్ల శాతం తారుమారైంది. ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎవరికివారు సింగిల్‌గా పోటీ చేస్తే..
ఆత్మసాక్షి తాజా సర్వే ప్రకారం ఎవరికి వారు ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి 86 స్థానాలు, వైసీపీకి 68 స్థానాలు, జనసేన 6 స్థానాలు వస్తాయని, 15 సీట్లలో హోరాహోరీ పోటీ ఉంటుందని వెల్లడైంది. అదే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం టీడీపీ 95 ఎమ్మెల్యే సీట్లు, జనసేన 13 సీట్లు గెలుచుకుంటుందని, వైసీపీ 60 స్థానాలకు పరిమితమవుతుందని తేలింది. 7 స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోటీ ఉంటుందని వెల్లడయింది. చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టు చేసిన తరువాత టీడీపీ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా 30-40 ఏళ్ల మధ్య వయసుగల ఓటర్లు, 60 ఏళ్లకు పైబడిన ఓటర్లు టీడీపీ, జనసేన వైపు భారీగా మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
పార్లమెంటు స్థానాల్లోనూ టీడీపీ-జనసేనదే హవా
ఏపీలోని మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో ఈసారి టీడీపీ-జనసేన కూటమి 17 స్థానాలు గెలవబోతున్నదని ఆత్మసాక్షి సర్వే తేల్చింది. వైసీపీకి కేవలం 7 స్థానాలు వస్తాయని, విజయనగరం, అమలాపురం, ఏలూరు, నెల్లూరు, రాజంపేట పార్లమెంటు స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలో వెల్లడైంది. జనసేన పొత్తు వల్ల ఈ సీట్లలో ఒక్క విజయనగరం మినహా అన్నిచోట్లా టీడీపీ విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది. విశాఖపట్టణం, గుంటూరు, చిత్తూరులో ఒక్కో పార్లమెంటు స్థానం, కడపలో రెండు పార్లమెంటు స్థానాలూ వైసీపీ ఖాతాలో పడనుండగా మిగిలిన స్థానాలన్నీ టీడీపీ కైవసం చేసుకుంటుందని వెల్లడైంది.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్నిసీట్లు?
ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి పోటీ చేస్తే వైసీపీకి 60 స్థానాలకు మించవని, టీడీపీ (95)- జనసేన (13) కలిపి 108 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాయని సర్వేలో వెల్లడైంది. ఏడు సీట్లలో హోరాహోరీ పోటీ ఉందని, వాటిలో 5 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉందని కూడా సర్వే తేల్చింది. ఏపీలో 50 శాతం ఓటర్లు టీడీపీ-జనసేన కూటమికి మద్దతు పలుకుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరితే మాత్రం వైసీపీకి 98-108 స్థానాలు దక్కనున్నాయని, బీజేపీ స్థానంలో వామపక్షాలు కలిస్తే మాత్రం టీడీపీ కూటమికి 115 నుంచి 122 స్థానాలు దక్కుతాయని చెప్పింది.
చంద్రబాబు అరెస్టు వెనుక బీజీపీ ఆశీస్సులు..
స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ మద్దతు ఉందని ఏపీలో 52 శాతం ప్రజలు నమ్ముతున్నారు. బీజేపీ మద్దతు లేదని కేవలం నమ్మేవారి సంఖ్య కేవలం 16 శాతమే ఉంది. చంద్రబాబు అరెస్టు వైసీపీ ఫలితాలపై ప్రభావం చూపుతుందని నమ్మేవారి సంఖ్య 51 శాతంకాగా, వైసీపీ ప్రభుత్వంపై ప్రభావం ఉండదని నమ్మేవారి సంఖ్య 35 శాతంగా ఉంది. కొంత ప్రభావం పడుతుందని నమ్మేవారు 10 శాతంగా ఉన్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు సక్రమమే అని నమ్మేవారి సంఖ్య 26 శాతంకాగా, 52 శాతం ప్రజలు అరెస్టు అక్రమమని నమ్ముతున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు జరిగిందని నమ్మేవారు 18 శాతం ఉండగా, ఎలాంటి అంచనాకు రాలేకపోతున్నామన్న వారి సంఖ్య 4 శాతంగా ఉంది.
2024 ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు..
ఏపీలో రానున్న ఎన్నికల్లో శాంతిభద్రతలు, ఇసుక, మద్యం లభ్యత, వాటి ధరలు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగం, రోడ్ల పరిస్థితి, పేదల ఇళ్ల నిర్మాణం, వాలంటీర్ల వ్యవస్థ, సర్పంచ్‌లకు నిధులు కేటాయించకపోవడం, పెరిగిన కరెంటు చార్జీలు, ఇంటిపన్ను, చెత్తపన్ను వంటి అంశాలు ప్రధానంగా ప్రభావం చూపుతాయని సర్వే సంస్థ అంచనా వేసింది. చంద్రబాబు అరెస్టు, పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత ఆరోపణలు, మూడు రాజధానుల వివాదం, అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రుల పనితీరుకూడా తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తేల్చింది.