Phone Tapping | ఏపీ నేతల ఫోన్లూ ట్యాప్‌? చంద్రబాబు, లోకేశ్‌, షర్మిల కూడా బాధితులే?

Phone Tapping | ఏపీ నేతల ఫోన్లూ ట్యాప్‌? చంద్రబాబు, లోకేశ్‌, షర్మిల కూడా బాధితులే?

Phone Tapping: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతున్న కొద్ది నివ్వెరపోయే కొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన phone tapping  వ్యవహారంపై 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు.. హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎస్ఐబీ చీఫ్‌గా పనిచేసిన టీ ప్రభాకర్ రావు, ఏసీపీలుగా పనిచేసిన భుజంగరావు, తిరుపతన్న, డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, టీవీ చానల్ అధినేత శ్రవణ్ రావుపై కేసు నమోదైంది. ఆ వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోయారు. మిగతా నిందితుల విచారణ సందర్భంగా ట్యాపింగ్ కేసులో సిట్ బృందం అనేక సంచలన అంశాలను రాబట్టగలిగింది. అయితే అమెరికా పారిపోయిన ప్రధాన నిందితులు టీ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు రాకతో కేసు విచారణ వేగం పుంజుకోవడంతో పాటు కీలక మలుపులు తీసుకుంటున్నది. ఇప్పటివరకు కేవలం తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టులు, జడ్జీలు, సెలబ్రిటీల ఫోన్లను మాత్రమే ట్యాపింగ్ చేశారనుకుంటే.. ప్రభాకర్ రావు విచారణ పిదప ఏపీ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లుగా వెల్లడవ్వడం సంచలనంగా మారింది.

బీఆర్ఎస్ ప్రత్యర్థులే లక్ష్యంగా ట్యాపింగ్ పర్వం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం తన సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్‌ ఐపీఎస్ ప్రభాకర్ రావును ఎస్ఐబీ చీఫ్‌గా నియమించి, ప్రత్యర్థి నేతలు, ఇతరుల ఫోన్‌లను ట్యాప్‌ చేయించారనే అభియోగాలు ఉన్నాయి. తన బాస్ ప్రయోజనాల కోసం ప్రభాకర్ రావు ఓ ప్రత్యేక టీమ్‌ను ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేశారని విచారణలో సిట్ గుర్తించింది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులతో కూడిన బృందం 2018నుంచి 2023వరకు కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, పలువురు వ్యాపారులు, జర్నలిస్టులు, జడ్జీలు, సెలబ్రిటీల ఫోన్‌లను ట్యాప్‌ చేయించారని తెలుస్తున్నది. ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకు ప్రణీత్ రావు అందించారు. ఆయన నేరుగా బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి సమాచారాన్ని వివరించారని విచారణలో తేలింది. ప్రతిపక్ష నేతల వైపు ఎవరైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు వెళ్తుంటే వెంటనే ఆ సమాచారాన్నిఅప్పటి అధికార బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి సమాచారం అందించేవారని తెలుస్తున్నది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి.. ఫోన్ ట్యాపింగ్‌తో వారి కదలికలను గుర్తించేవారని, పోలీసులతో తనిఖీలు చేయించి, ఆ డబ్బును మధ్యలోనే పట్టుకునేవారని చెబుతున్నారు. వ్యాపారవేత్తలపై దాడుల కోసం రాధాకిషన్‌ను ప్రభాకర్ రావు వాడుకున్నాడని.. ఎవరైనా డబ్బులు తీసుకెళ్తుంటే వెంటనే ట్యాప్ చేసి పట్టుకునే వారని సిట్ విచారణలో గుర్తించిందని సమాచారం. ముఖ్యంగా హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా, తదుపరి 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేతల ఫోన్లను, డబ్బు తరలించేవారి ఫోన్లను పెద్ద ఎత్తున ట్యాప్ చేసి కోట్ల రూపాయల మధ్యలోనే ప్రభాకర్ రావు టీమ్ తన్నుకుపోయేవారని విచారణలో వెల్లడైంది. రాధాకిషన్ బృందం వ్యాపారుల ఫోన్ల ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిందని సమాచారం.

అసెంబ్లీ ఎన్నికలలో 650మందికి పైగా ఫోన్ల tapping
అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 15న 600 మంది ఫోన్లను ప్రభాకర్ రావు టీమ్ ట్యాపింగ్ చేసిందని తెలుస్తున్నది. బీఆర్ఎస్‌ వ్యతిరేకులే లక్ష్యంగా ప్రణీత్‌రావు ఆధ్వర్యంలోని ఎస్వోటీ టీమ్ ట్యాపింగ్‌లో కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. 2022 నవంబర్ లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సహకారం అందించే వారి ఫోన్ నంబర్లను ట్యాప్ చేయడంలో పోషించిన పాత్రతో తన 2017బ్యాచ్ లోని ఎస్సైలలో ఒకే ఒక్కడుగా ప్రణీత్ రావు డీఎస్పీ పదోన్నతి సైతం పొందాడు. ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్‌లో తెలంగాణ హైకోర్టు జడ్జి కూడా ఉన్నారని సిట్ గుర్తించింది. అప్పటి ప్రతిపక్ష నేత సీఎం రేవంత్ రెడ్డి, ప్రస్తుత చీఫ్ బీ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీలు రఘునందన్ రావు, అర్వింద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్, ప్రస్తుత కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఫోన్లను ట్యాపింగ్ చేశారని తెలుస్తున్నది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఏకంగా 650మందికి అప్పటి ప్రతిపక్ష, అధికారపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు. అప్పటి బీఆర్ఎస్ నేతల, ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారు. ఓ మహిళా ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేసి అప్పటి మంత్రికి అందించారని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ప్రభాకర్ రావు కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రణీతరావుకు అందించారు.

ఏపీలోకి తెలంగాణ ట్యాపింగ్ తీగలు
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావు బృందం తన బీఆర్ఎస్ బాసుల కోసం ఏపీకి చెందిన అప్పటి వైసీపీ ప్రత్యర్ధుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లుగా తాజాగా సిట్ గుర్తించింది. అప్పటి ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, లోకేశ్, వారికి సన్నిహితంగా ఉండే నేతల ఫోన్లను ట్యాప్ చేశారని సమాచారం. హైదారాబాద్ లో ఉన్న నాటి ఏపీ సీఎం వైస్‌ జగన్‌ సోదరి షర్మిల ఫోన్లను ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని జగన్ కు చేరవేశారన్న అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చినట్లుగా కథనం. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారో జగన్‌కు తెలిపేవారని సిట్ గుర్తించింది. చంద్రబాబు, షర్మిల ఫోన్లతో పాటు ఏపీకి చెందిన 100మందికి పైగా రాజకీయ నేతలు, వ్యాపారుల ఫోన్‌లు ట్యాప్‌ అయినట్టు తెలుస్తున్నది. గతంలో మాజీ మంత్రి, వైసీపీ మాజీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ ‌జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు చర్చల ఎపిసోడ్ కూడా phone tapping తోనే కేసీఆర్ పసిగట్టారని, ఆ విషయం వారికి చెప్పి మరీ బీజేపీ నేతలను ట్రాప్‌ చేయించారనే చర్చలు అప్పట్లో కూడా జరిగాయి. పలువురు సినీ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్‌ చేసి, భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం ట్యాపింగ్ పరాకాష్టకు నిదర్శనం.

మావోయిస్టుల ముసుగులో ట్యాపింగ్ నెంబర్లు
ట్యాపింగ్‌ చేసే నంబర్‌ల విషయంలో ప్రభాకర్‌రావు బృందం అతి తెలివిని ప్రదర్శించినట్టు తెలుస్తున్నది. మావోయిస్టులకు సహకరిస్తున్నవారి నంబర్‌లుగా చెప్పి.. యథేచ్ఛగా ట్యాపింగ్‌ కొనసాగించినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని పై అధికారులకు చెప్పిన ప్రభాకర్ రావు.. మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో ప్రతిపక్ష, వ్యాపార, జర్నలిస్టుల ఫోన్ నెంబర్లను పంపించి ట్యాపింగ్ కొనసాగించారని విచారణలో తేలిందని చెబుతున్నారు. 2023అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ బీఆర్ఎస్ ఓటమి ఖాయమని గ్రహించిన ప్రభాకర్ రావు బృందం తమ సెల్ ఫోన్లు, కంప్యూటర్లలోని డాటాను డిలీట్‌ చేసినట్టు సిట్‌ వర్గాలు చెబుతున్నాయి. హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసి మూసీలో పడేసింది. ప్రణిత్ రావు తన సెల్‌ఫోన్‌లో 2023 జూన్ వరకు ఉన్న డాటా డిలీట్ చేయకపోవడంతో ఆ సమాచారం దర్యాప్తులో సిట్‌కు కీలకంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ విచారణను కీలకదశకు చేర్చిన సిట్ బృందం.. ఇప్పుడు వందల సంఖ్యలో ఉన్న బాధితులను రప్పిస్తూ నిందితుల ముందు ముఖాముఖి (కన్ ఫ్రంటేషన్) మాట్లాడిస్తూ సాక్షులుగా వారి వాంగ్మూలాలను నమోదు చేయనున్నది. ఈ విచారణలో మరిన్ని విభ్రాంతికర అంశాలు వెలుగు చూస్తాయన్న చర్చలు జరుగుతున్నాయి.

రేపు సిట్ ముందుకు బీజేపీ నేతలు
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎంపీలు ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌ హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. లోక్‌సభ ఎన్నికల సమయంలో వీరి ఫోన్‌లను ట్యాప్‌ చేసినట్టు సమాచారం. 2023, నవంబర్ 15 నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారని తెలుస్తున్నది.
బీజేపీ నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు గుర్తించారని చెబుతున్నారు. బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు తెలుసుకుని, కావాల్సిన వారికి చేరవేసేవారని అంటున్నారు. బీజేపీకి ఆర్థిక సహాయం చేస్తున్నవారి వివరాలు సైతం వెళ్లాయని, ఈ సమాచారాన్ని భుజంగరావు.. ప్రభాకర్‌రావుకు తెలిపేవారని చెబుతున్నారు.