SLBC Tunnel Mishap : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమీషన్ సీరియస్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో 9 నెలలుగా ఆరుగురు గల్లంతైన కార్మికుల మృతదేహాల వెలికితీత ఆలస్యంపై జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC) సీరియస్‌గా స్పందించింది. మృతదేహాల వెలికితీత జాప్యంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్ రామకృష్ణరావును ఆదేశించింది.
విధాత: ఎస్ ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాల వెలికితీత ఆలస్యంపై జాతీయ మానవ హక్కుల కమీషన్ సీరియస్ అయ్యింది. తొమ్మిది నెలలు అవుతున్నా గల్లంతైన కార్మికుల ఆచూకీ ఇంకా కనుగొనలేకపోవడంపై కమీషన్ స్పందించింది.
ఇప్పటివరకూ.. రెండు మృతదేహాలు (మనోజ్ కుమార్, గురుప్రీత్ సింగ్) మాత్రమే వెలికితీయగా, మరో ఆరుగురి మృతదేహాలు సొరంగంలోనే ఉండిపోయాయి. కొన్నాళ్ల రెస్క్య్రూ ఆపరేషన్ తర్వాతా మృతదేహాల వెలికితీత ప్రయత్నాలు నిలిపివేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమీషన్ సీఎస్ రామకృష్ణరావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహాల వెలికితీత ప్రక్రియలో ఎందుకు జాప్యం జరుగుతోందో విచారణ చేపట్టి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించింది.
ఫిబ్రవరి 22న సొరంగం కూలి 8మంది కార్మికులు గల్లంతయ్యారు. 60రోజుల పాటు కొనసాగించిన రెస్క్య్రూ ఆపరేషన్ లో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. సొరంగం 14 కి.మీ. లోపల చివరన 43 మీటర్లు ప్రమాదకరంగా ఉండటంతో డీ2 పాయింట్ వద్ద రెస్క్య్రూ ఆపరేషన్ నిలిపి వేసి ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. అక్కడి మట్టిని తొలగిస్తే మళ్లీ సొరంగం కూలిపోయే అవకాశం ఉందని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు స్పష్టం చేశారు. ఇనుప కంచె వరకు తవ్వకాలు పూర్తికాగా మిగతా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. వారు ఆ 43 మీటర్ల పరిధిలోనే కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంకా పనులు కొనసాగించాలా, వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram