Srisailam | శ్రీశైలంకు పోటెత్తిన వరద .. రేపు గేట్లు ఎత్తే అవకాశం
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా నదికి గంట గంటకూ వరద ఉదృతి పెరుగుతోంది.

4.41 లక్షల క్యూసెక్కులకు పైగా వరద
విధాత: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా నదికి గంట గంటకూ వరద ఉదృతి పెరుగుతోంది. ఇప్పటికే ఎగువ ప్రాంతంలో ఆల్మట్టి, నారాయణపూర్,జూరాల రిజర్వాయర్లు పూర్తిగా నిండాయి. దీంతో ఆల్మట్టి నుంచి 3 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా కిందకు వదులుతున్నారు. అలాగే నారాయణ పూర్ నుంచి కూడా అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయడంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నారాయణ పూర్ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగానే అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. అలాగే తుంగభద్ర నుంచి లక్షన్నర క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇలా ఆల్మట్టి, తుంగభద్రల నుంచి శ్రీశైలం కు 4,41,222 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ఆదివారం మధ్యాహ్నం వరకు నీటి మట్టం 873.4 అడుగులకు చేరుకున్నది. మరో 62.84 టీఎంసీలతో పూర్తి స్థాయిలో నిండుతుంది. అయితే మరో 30 టీఎంసీల వరకు నీరు వచ్చి చేరగానే గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతారు. ఇదేస్థాయిలో వరద ప్రవాహం వస్తే మంగళవారం ఉదయం శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చే యనున్నారు. ఈ మేరకు అధికారులు నీటిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 53.677 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కు వదులుతున్నారు. సాగర్ జలాశయంలో 510.1 అడుగుల మేరకు నీరు ఉన్నది. ప్రస్తుతం సాగర్ లో 131.84 టీఎంసీల నీరు ఉండగా పూర్తి స్థాయిలో జలాశయం నిండడానికి మరో 180. 21 టీఎంసీల నీరు అవసరం.