TTD Chairman BR Naidu : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో భారీ ఏర్పాట్లు.. గరుడసేవకు లక్షలాది భక్తుల రాక అంచనా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

TTD Chairman BR Naidu : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

తిరుమల : తిరుమలలో ఈ నెల 24 నుంచి ఆక్టోబర్ 2వరకు నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయనున్నట్లుగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. మంగళవారం జరిగిని టీటీడీ పాలక మండలి సమావేశం నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. తొలిసారిగా బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలించబోతున్నట్లు చెప్పారు. ఈనెల 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని..24 నుంచి అక్టోబరు 2 వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 24న మీన లగ్నంలో ధ్వజారోహణం, అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఈనెల 28న జరిగే శ్రీవారి గరుడసేవకు 3 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్‌ విధానం అమలు చేయబోతున్నాం అని తెలిపారు. . పది రోజులపాటు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేయబోతున్నాం అని వెల్లడించారు.

రాష్ట్రంలో కొత్తగా వేయి ఆలయాలు

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వెయ్యి ఆలయాలను నిర్మించాలని టీటీడీ మండలిలో నిర్ణయించిందని చైర్మన్ నాయుడు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆరు ఆలయాల వరకు నిర్మిస్తామని..మతమార్పిడుల కట్టడికి శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మిస్తామన్నారు. అంతకుముందు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు సభ్యులతో కలిపి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌-2025ని బీఆర్‌ నాయుడు విడుదల చేశారు.