తెలంగాణలో.. పసుపు బోర్డు, గిరిజన వర్సిటీకి ఓకే

- కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుకూ అంగీకారం
- ఉజ్వల లబ్ధిదారులకు సబ్సిడీ 300కు పెంపు
- కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి తెలంగాణకు ఇచ్చిన రెండు హామీలు.. పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని 200 నుంచి 300కు పెంచింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. వివరాలను అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.
ప్రధానమంత్రి ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా హామీ ఇచ్చిన మేరకు సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 889 కోట్ల రూపాయలతో ఈ కేంద్రీయ వర్సిటీని నెలకొల్పనున్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
మరోవైపు జాతీయ పసుపు బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పసుపు ఎగుమతులను ప్రస్తుతం ఉన్న 1600 కోట్ల రూపాయల నుంచి 8,400 కోట్ల రూపాయలకు పెంచే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. పసుపు ఎగుమతులు 2030 సంవత్సరానికి వంద కోట్ల డాలర్లకు పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తున్నది.
ఇదిలా ఉంటే.. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కృష్ణాజలాల వివాదాన్ని పరిష్కరించేందుకు విధివిధానాలు ఖరారు చేసే బాధ్యతను రెండో కృష్ణా ట్రిబ్యునల్‌కు కేంద్రం అప్పగించింది. దాదాపు 50 లక్షల మంది రైతులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కొత్త నిబంధనలు రూపొందించి, తమ వాటాను తేల్చాలని కోరుతున్న తెలంగాణ ఆకాంక్ష.. ఈ నిర్ణయంతో సాకారం అవుతుందని అన్నారు.
ప్రస్తుతంలో ఉజ్వల లబ్ధిదారులు 14.2 కిలోల గ్యాస్‌బండ 903 రూపాయలకు బదులు సబ్సిడీ 200 పోను 703 రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ సబ్సిడీని 300కు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఠాకూర్ తెలిపారు. త్వరలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.