ఉమ్మడి రాష్ట్రంలో రెండు దర్యాప్తులు.. ఔటర్‌పై సీబీఐ నివేదికతో ఉక్కిరిబిక్కిరి.. జగన్ కేసులో ఐఏఎస్‌ల జైలు జీవితం

CBI Investigation | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన కేసులలో సీబీఐ దర్యాప్తుల సాగాయి. ఒక దర్యాప్తులో సంబంధిత అధికారులకు ఎలాంటి శిక్షలు వేయలేదు. ఇందులో భాగస్వాములైన రాజకీయ నాయకులు తప్పించుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో రెండు దర్యాప్తులు.. ఔటర్‌పై సీబీఐ నివేదికతో ఉక్కిరిబిక్కిరి.. జగన్ కేసులో ఐఏఎస్‌ల జైలు జీవితం

హైదరాబాద్, సెప్టెంబర్‌ 1 (విధాత): CBI Investigation | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన కేసులలో సీబీఐ దర్యాప్తుల సాగాయి. ఒక దర్యాప్తులో సంబంధిత అధికారులకు ఎలాంటి శిక్షలు వేయలేదు. ఇందులో భాగస్వాములైన రాజకీయ నాయకులు తప్పించుకున్నారు. మరో దర్యాప్తులో బాధ్యులైన అధికారులు జైలుకు వెళ్లారు. రాజకీయ నాయకులు ఇప్పటికీ సీబీఐ ప్రత్యేక కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతునే ఉన్నారు. ఈ రెండు దర్యాప్తులు ఉమ్మడి రాష్ట్రాన్ని కుదిపేశాయి. తాజాగా కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటంతో గతంలోని వాటి తాలూకు అంశాలు, పరిణామాలు తెరమీదికి వచ్చాయి. పైగా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇది తొలి రాజకీయ కేసు కావడం విశేషం.

అవిభాజ్య అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. దీని నిర్మాణం, భూ సేకరణ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ని హుడా (ప్రస్తుతం హెచ్ఎండీఏ)కు అనుబంధంగా ఏర్పాటు చేశారు. 2006 జనవరి 3వ తేదీన అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఓఆర్ఆర్‌కు శంకుస్థాపన చేశారు. 158 కిలోమీటర్ల పొడవున నాడు ప్రతిపాదించిన రోడ్డు కోసం జరిగిన భూ సేకరణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ప్రభుత్వంలోని పెద్దల సిఫారసుల ప్రకారం అలైన్ మెంట్ అష్టవంకరలు తిరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పత్రికలు, ప్రసార సాధనాల్లో పతాక శీర్షికల్లో వార్తలు రావడంతోపాటు అప్పటి ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా విమర్శలు గుప్పించింది. అలైన్‌మెంట్‌ మార్పిడి మూలంగా చిన్న చిన్న రైతులు చితికిపోయారని, అధికార పార్టీ నాయకుల భూములు, వారి బంధువుల భూములు, పైరవీలు చేసుకున్న వారి స్థలాలు భూ సేకరణ నుంచి మినహాయింపు పొందాయని ఆరోపించారు. అసెంబ్లీలో అధికార పక్షం, విపక్షం మధ్య వాదనల తరువాత ఔటర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, భూ సేకరణపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు సీబీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా బేగంపేటలోని హుడా కార్యాలయంలో అప్పటి చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శితో పాటు తార్నాకలోని ఔటర్ రింగ్ రోడ్డులో పనిచేస్తున్న ప్రాజెక్టు డైరెక్టర్, ఓఎస్డీ, భూ సేకరణ అధికారులు, ప్రాజెక్టు ఇంజినీర్లను పలు దఫాలు విచారించారు. వీరే కాకుండా సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులను కూడా విచారించి ఆధారాలు సేకరించారు. విచారణ తరువాత తమ మెడకు ఏం చుట్టుకుంటుందోనని అధికారులు, నాయకులు ఆందోళనకు గురయ్యారు. సీబీఐ తన దర్యాప్తు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసింది. నివేదికను పరిశీలించిన తరువాత అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. కేంద్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం కలిసి వచ్చిందనే చెప్పాలి. మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కేంద్రంలో కూడా అదే ప్రభుత్వం రావడంతో ఎవరు కూడా ఈ నివేదికను అంత సీరియస్ గా తీసుకోలేదనే చెప్పాలి.

అక్రమాస్తుల కేసులకు ఇదీ నాంది

రెండవసారి సీఎం రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడం, అకాల మరణం చెందడంతో ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒక వైపు తన తండ్రి శవం ఇంట్లో ఉన్న సమయంలోనే తన తండ్రి అధికారం తనకే ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించడం, తిరస్కరించిన కాంగ్రెస్ అధిష్ఠానం సీనియర్ నాయకుడు రోశయ్యను సీఎం సీట్లో కూర్చోబెట్టడం జరిగిపోయాయి. ఆయన కూడా కొద్ది నెలలకే పదవి నుంచి వైదొలిగి తమిళనాడు గవర్నర్ గా వెళ్లిపోయారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్రంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న పార్టీ నాయకత్వం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. తనకు సీఎం కుర్చీ ఇవ్వలేదని ఆగ్రహంతో ఊగిపోయిన జగన్ రెడ్డి అధిష్ఠానంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాంగ్రెస్‌ పార్టీకి కంట్లో నలుసుగా మారారు. రాజశేఖర్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్న కొందరు నేతలు పార్టీ పెద్దలకు ఆయన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీ పై నివేదికలు అందచేశారు. జగన్ రెడ్డి అక్రమాస్తులపై విచారణ జరపాలంటూ మాజీ మంత్రి పీ.శంకర్ రావు 2011లో హైకోర్టులో కేసు వేయడం, సీబీఐ విచారణకు ఆదేశించడం జరిగిపోయింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2012 మే నెలలో సీబీఐ మూడు రోజుల పాటు హైదరాబాద్ రాజ్ భవన్ పక్కనే ఉన్న దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో జగన్ మోహన్ రెడ్డిని విచారించి.. అదుపులోకి తీసుకున్నది. 72 మంది సాక్షులను విచారించిన తరువాత 88 పేజీల చార్జ్‌షీటు దాఖలు చేసింది. సీబీఐతో పాటు ఈడీ అధికారులు కూడా విచారించారు. ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డి 16 నెలల పాటు చంచల్ గూడ లో జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. వాన్ పిక్ ఓడరేవుకు భూ కేటాయింపుల్లో క్విడ్ ప్రోకో జరిగిందని, కడపలో సున్నపు రాయి గనులు, భారతీ సిమెంట్ లో దాల్మియా సిమెంట్ కంపెనీ పెట్టుబడులపై సీబీఐ ఎప్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసింది. దాల్మియా సిమెంట్ కు చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆయన ఏపీ ముఖ్యమంత్రి కాక ముందు విచారణ కోసం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేవారు. సీఎం అయిన తరువాత విచారణ నుంచి మినహాయింపు ఊరట లభించింది. సీబీఐ చార్జ్‌షీటులో అప్పటి మంత్రి జే గీతారెడ్డి, పీ సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణ పేర్లు చేర్చారు. ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్‌తోపాటు పాటు పెన్నా సిమెంట్స్, భారతీ సిమెంట్, ఇండియా సిమెంట్ కంపెనీ, ఇందూ గ్రూపు లపై చార్జ్‌షీట్లు దాఖలయ్యాయి. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, బూసీ శ్యామ్ బాబు, ఎం సామ్యూల్, మన్మోహన్ సింగ్, ఆదిత్యనాథ్‌ దాస్, రత్నప్రభ, వై శ్రీలక్ష్మీ ఉన్నారు. వీరిలో బీపీ ఆచార్య, శ్రీలక్ష్మీ కొన్ని నెలలు జైలు జీవితం గడిపారు. ఇప్పటికీ శ్రీలక్ష్మీ పై కేసు నడుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జరుగుతున్న దర్యాప్తులకు సంబంధించిన సమాచారం లీకయ్యిందనే ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీబీఐ నుంచి నివేదిక కోరడం జరిగింది. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. మాజీ అయిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ బిక్కు బిక్కుమంటూనే, ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ విచారించినప్పటికీ చర్యలు వేర్వేరుగా ఉన్నాయి. ఔటర్ లో చాలా మంది చర్యల నుంచి తప్పించుకోగా, అక్రమాస్తుల కేసు నుంచి జగన్ తో పాటు మాజీ మంత్రులు, సీనియర్ ఐఏఎస్ లు, పారిశ్రామికవేత్తలు తప్పించుకోలేకపోయారు.

కాళేశ్వరంలో ఈడీ ప్రవేశిస్తుందా?

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినందున ఈడీ ప్రవేశించే అవకాశాలు కన్పిస్తున్నాయి. బారాజ్ ల ద్వార స్పష్టమైన రాబడులు ఏవీ లేకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ అప్పులు తీసుకున్నది. ఇలా సమకూరిన నిధులను పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించారు. కార్పొరేషన్ బోర్డులో సభ్యులుగా ఉన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కాళేశ్వరం జ్యూడిషియల్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇదే కాకుండా కార్పొరేషన్ సేకరించిన రుణ విధానం, నిధుల పంపిణీలో ఎవరికి లాభం అనే దానిపై లోతుగా దర్యాప్తు చేయాలని కమిషన్ తన నివేదికలో ఆదేశించింది. కాంట్రాక్టర్లు సమర్పించిన బిల్లులు, వాటి మంజూరుకు అనుసరించిన పద్ధతులలో లోపాలున్నాయి. బారాజ్ ల నిర్మాణం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కార్పొరేషన్ బడ్జేట్ యేతర రుణాలు తీసుకున్నాయని, ఈ రుణాలకు చట్టాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరించారా అనే దానిపై అధ్యయనం అవసరం అని కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ఆధారంగా సీబీఐ ఆర్థిక అవకతవకలను నిగ్గు తేల్చేందుకు ఈడీకి లేఖ రాసి, విచారించాలని కోరే అవకాశాలను కాదనలేమని ఆర్థిక నిపుణుడు ఒకరు పేర్కొన్నారు.