కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి.. సాకే శైలజనాథ్

కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టులు అమానుషంఎపిసిసి అధ్యక్షులు డా.సాకే శైలజనాథ్ విధాత:దేశంలోని ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారంలో వున్న పెద్దలెవరో బయటపెట్టాలని ఎపిసిసి అధ్యక్షులు డా. సాకే శైలజనాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ వ్యవహారానికి సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రరత్న భవన్ నుండి రాజభవన్ వరకు శాంతియుత వాతావరణంలో నిరసన ర్యాలీ గా బయలుదేరిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం అక్రమమని ఆయన ఆగ్రహం వ్యక్తం […]

కేంద్ర హోంమంత్రి అమిత్ షా  రాజీనామా చేయాలి.. సాకే శైలజనాథ్

కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టులు అమానుషం
ఎపిసిసి అధ్యక్షులు డా.సాకే శైలజనాథ్

విధాత:దేశంలోని ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారంలో వున్న పెద్దలెవరో బయటపెట్టాలని ఎపిసిసి అధ్యక్షులు డా. సాకే శైలజనాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ వ్యవహారానికి సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రరత్న భవన్ నుండి రాజభవన్ వరకు శాంతియుత వాతావరణంలో నిరసన ర్యాలీ గా బయలుదేరిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం అక్రమమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులు, ఎపిసిసి రాష్ట్ర విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వాల నిరంకుశ వ్యవహారశైలిని తప్పుపట్టిన శైలజనాథ్ పోలీస్ ల తీరుపై మండిపడ్డారు.

ప్రజల వ్యక్తిగత స్వేచ్చని హరించే హక్కు ప్రభుత్వ పెద్దలకి ఎవరిచ్చారని ప్రశ్నించిన ఆయన ప్రముఖ న్యాయవాదులు, జర్నలిస్టులు, యూనియన్ మినిస్టర్లు, ప్రతిపక్ష నేతలతో సహా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ మరియు ఆయన సిబ్బంది యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం వెనుక వున్న కుట్రలను బట్టబయలు చేయాలన్నారు. కేవలం ఉగ్రవాదులు, సంఘ విద్రోహచరులకు పాల్పడే వారి ఫోన్లు ట్యాపింగ్ కోసం ఉపయోగించే పెగాసస్ స్పైవేర్ ను దేశంలోని పౌరుల మీద, ప్రముఖ రాజకీయ నాయకుల మీద ఉపయోగించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

దేశంలో ఇంత జరగడానికి కేంద్రంలో అధికారం లో వున్న ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా జరగదని, అసలు పెగాసస్ ను దేశాధినేతలకు మాత్రమే ఇస్తామని ఆ సాఫ్ట్వేర్ తయారీ సంస్థ చెప్పడం చూస్తుంటే ఈ కుట్రలో ప్రధాన దోషి బిజెపి ప్రభుత్వమేనని తేటతెల్లమవుతున్నదన్నారు. తన మంత్రుల మీద తనకే నమ్మకంలేని ప్రధాని, చివరికి బిజెపి మంత్రులపై కూడా నిఘా పెట్టడం చూస్తుంటే పదవికోసం మరీ ఇంతగా పాకులాడతారా, తన మీద, తన పరిపాలన మీద ఆయనకే నమ్మకం లేదా అని ఆశ్చర్యమేస్తోందన్నారు. నరేంద్ర మోదీ నిరంకుశ విధానాలను చూస్తుంటే హిట్లర్ పరిపాలన గుర్తుకొస్తోందని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు సహించేది లేదని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేకెత్తించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై సుప్రీమ్ కోర్ట్ పర్యవేక్షణలో విచారణ జరిపించాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ దేశ హోమ్ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేసారు.

ప్రజల పై నిఘా పెట్టి వారి నీడని కూడా వెంటాడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ఎదిరించే సత్తా లేని ప్రశ్నించే ధైర్యం లేని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, స్వచ్చందంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను మాత్రం అక్రమంగా అరెస్ట్ చేసి తన మోడీతో వున్నా స్నేహబంధాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారని ఎద్దెవా చేసారు.

ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీస్ ల సాయంతో అణిచివేయాలని చూసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదని, బిజెపికి గులాంగిరి పరిపాలన సాగిస్తున్న వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రతిపక్షాలతో కలిసి బిజెపి ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలపాలని శైలజనాథ్ సూచించారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు డా ఎన్ తులసి రెడ్డి, మస్తాన్ వలి, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్ర రాజు, సీనియర్ నాయకులు కేబీఆర్ నాయుడు, హర్షకుమార్ తదితరులు పాల్గొన్నారు.