Mylavarapu Krishna Teja | పట్టువిడవని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీకి డిప్యుటేషన్‌పై ఐఏఎస్ కృష్ణతేజ.. అసలు ఎవరాయన..?
Mylavarapu Krishna Teja | ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవాలనే సంకల్పంతో కొణిదల పవన్ కల్యాణ్.. అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో పాలిటిక్స్‌లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్.. అనేక అవమానాలు, అడ్డంకులను అధిగమించి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి.. 21 స్థానాల్లో గెలుపొందారు. డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు జనసేనాని.

Mylavarapu Krishna Teja | ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవాలనే సంకల్పంతో కొణిదల పవన్ కల్యాణ్.. అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో పాలిటిక్స్‌లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్.. అనేక అవమానాలు, అడ్డంకులను అధిగమించి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి.. 21 స్థానాల్లో గెలుపొందారు. డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు జనసేనాని. ఏపీలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ పవన్ కల్యాణ్‌కు.. చంద్రబాబు కీలక శాఖలను కట్టబెట్టారు. డిప్యూటీ సీఎంతోపాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ-పర్యావరణం,సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వశాఖలు కట్టబెట్టారు.
ప్రజలు తనకు అవకాశం ఇవ్వడంతో.. ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడం పవన్ కల్యాణ్ వంతు. అందుకోసం పవన్ కళ్యాణ్ కు ఓ అద్భుతమైన టీమ్ కావాలి. ప్రత్యేకించి పవన్ పాలనలో ఆయన అనుకున్న లక్ష్యాలను నెరవేర్చటానికి సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండటం అవసరం. అలాంటి అధికారులపై పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. తన శాఖలను సమర్థవంతంగా నిర్వహించగలిగే సత్తా ఉన్న అధికారులపై డిప్యూటీ సీఎం మొగ్గు చూపారు. అలాంటి అధికారుల్లో పవన్ కంట ఐఏఎస్ మైలవరపు కృష్ణతేజ పడ్డారు. ఇక తాను అనుకున్నట్టు కృష్ణతేజను ఏపీకి డిప్యుటేషన్ మీద తెచ్చుకోగలిగారు డిప్యూటీ సీఎం పవన్.
ఏపీకి చెందిన మైలవరపు కృష్ణతేజ.. కేరళ క్యాడర్‌లో ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజ కేరళలో ఎన్నో అద్బుతమైన కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. మొత్తానికి కేరళలో కృష్ణతేజ ఓ ఐఏఎస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించారు. కేరళ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో చూపించిన ఒరవడిని కృష్ణతేజ ఏపీలో కూడా చూపిస్తే.. పవన్ కల్యాణ్ తన అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టే.
ఏపీకి డిప్యుటేషన్‌పై కృష్ణతేజ.. ఉత్తర్వులు జారీ
కేరళ క్యాడర్ 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజను డిప్యుటేషన్ మీద ఏపీకి పంపడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్రం శుక్రవారం జారీ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాను నిర్వహించే శాఖల పర్యవేక్షణ కోసం కృష్ణతేజను ఎంచుకున్నారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం కృష్ణతేజను మూడేండ్ల పాటు డిప్యుటేషన్‌పై ఏపీకి పంపేందుకు ఆమోదముద్ర వేసింది. ఐఏఎస్ కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు. అంతకుముందు కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా, ఎస్సీల అభివృద్ధి విభాగం డైరెక్టర్‌గా, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.
ఏడేండ్ల కేరీర్‌లో ఎన్నో ఘనతలు..!
పవన్ కల్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన ఏడేళ్ల కెరీర్‌లో ఎన్ని ఘనతలు సాధించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66 ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్‌లో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్‌గా నియమితులైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీస్‌లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. ఆయన కెరీర్‌లో అద్భుతమైన పేరు సంపాదించిపెట్టిన, పవన్ లాంటి నాయకులను అంతలా ఆకర్షించిన ఘటనలు ఏంటో చూద్దాం.
ఆపరేషన్ కుట్టనాడు.. కృష్ణతేజ తొలి విజయం..
2018లో వచ్చిన వరదలు కేరళను అతలాకుతలం చేశాయి. ఆ వరదల సమయంలో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్‌గా కృష్ణతేజ ఉన్నారు. అదే ఆయనకు తొలి పోస్టింగ్. అలెప్పీ వరద ప్రభావానికి తీవ్రంగా గురవుతుందని కృష్ణతేజకు సమాచారం అందింది. అలాంటి సమయాల్లో ఆఫీసర్లు సాధారణంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఆధారపడుతారు. కానీ కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మంది ప్రజలను 48 గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిన సమావేశమైన కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. పై అధికారులకు ఏం జరిగిందో తెలిసే లోపే స్థానిక యువతతో కలిసి 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కృష్ణతేజ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్. స్వయంగా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ ఐఏఎస్ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం. దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్య్కూ ఆపరేషన్స్‌లో ఒకటిగా ఆపరేషన్ కుట్టునాడు నిలిచింది.
ఐయామ్ ఫర్ అలెప్పీ.. యునిసెఫ్ సైతం ప్రశంసలు
ఆపరేషన్ కుట్టునాడుతో కృష్ణతేజ ఆగిపోలేదు. వరద ప్రభావితుల కోసం ఏదైనా మంచి చేయాలనే దిశగా ఆలోచించారు ఆయన. ప్రభుత్వ సాయం కోసం ఆయన ఎదురుచూడలేదు. ‘ఐయామ్ ఫర్ అలెప్పీ’ పేరుతో ఓ ఫేస్ బుక్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్ ఎంతో మంది కేరళవాసులను ఆకర్షించింది. అలెప్పీకి తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారటంతో వేరే రాష్ట్రాల నుంచి అలెప్పీ కోసం సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి అలెప్పీలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించాలనే ప్రాజెక్టును చేపట్టారు. ఆ బాధ్యతలను కృష్ణతేజకే రామోజీరావు అప్పగించారు. బాహుబలి టీమ్ ద్వారా రాజమౌళి, యాంకర్ సుమ ఇలా ఎంతో మంది అలెప్పీలో బాధితుల కోసం తరలివచ్చేలా కృష్ణతేజ మాట్లాడి ఒప్పించగలిగారు. పడవలు కోల్పోయిన వారికి జోవనోపాధి కోసం పడవలు, నిత్యావసర సరుకులు, స్కూళ్లను తిరిగి కట్టడం, ఇళ్లు కోల్పోయిన బాధితులకు తిరిగి సొంత ఇంటిని కట్టించి ఇవ్వటం ఐయామ్ ఫర్ అలెప్పీ ఓ ఫేస్ బుక్ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు. యునిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే ఫేస్‌బుక్ పేజ్‌ను మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కృష్ణతేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయో. వరదల కారణంగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌ను తిరిగి ప్రారంభించేలా చేశారు. 2019లో కేరళవాసులు అక్కున చేర్చుకున్న అల్లు అర్జున్‌ను, ఆ తర్వాత ఏడాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను బోట్ రేస్‌కి అతిథులుగా పిలిచి పర్యాటకులను అలెప్పీ వైపు ఆకర్షించేలా కృష్ణతేజ చేయగలిగారు. ఇంత చేశారు కాబట్టే అలెప్పీ సబ్ కలెక్టర్ పొజిషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్లిపోతున్నట్లు అలెప్పీ వాసులు తల్లడిల్లిపోయారు. అద్భుతమైన అధికారిని వదులుకోలేమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
పర్యాటక శాఖలో విప్లవాత్మక మార్పులు
కేరళ పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్క్ చూపించారు. మిషన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుబడిపోయిన టూరిజం హోటళ్లను మోడ్రనైజ్ చేయించారు కృష్ణతేజ. కేటీడీసీ ఆధ్వర్యంలోని రిసార్టులను అభివృద్ధి చేయటంతో పాటు మాయా పేరుతో ఓ చాట్ బోట్‌ను క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్ చేసేలా సాంకేతికతను రూపొందించటంలో కృష్ణతేజ సక్సెస్ అయ్యారు. ఇక కరోనా విలయం కేరళను చుట్టేయటంతో ప్రజలకు మరింత సేవలను అందించేలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ గానూ నియమించింది. అంతటి కల్లోల విపత్తులోనూ ప్రజలు ఆకలితో పస్తులు ఉండకుండా ప్రతీ ఇంటికి ఫుడ్ కిట్ ఇంకా నిత్యావసరాల కిట్‌లను అందించేలా కృష్ణతేజ రూపొందించిన రూట్ మ్యాప్.. ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ తర్వాత తనకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టిన అలెప్పీ జిల్లాకే కలెక్టర్‌గా నియమితులయ్యారు కృష్ణతేజ.
54 విల్లాలు కుప్పకూలేలా చేసిన కృష్ణతేజ..
అలెప్పీ జిల్లాలో ప్రవహిస్తున్న వెంబనాడ్ సరస్సు వద్ద Kapico రిసార్టు ఉంటుంది. ఇది తెలియని వారుండరు. ఈ విలాసవంతమైన రిసార్టులో ఒక్క రాత్రి గడపాలంటే 55 వేలు చెల్లించాల్సిందే. అయితే సరస్సును చెరిచి.. కళ్లు చెదిరిపోయే రీతిలో 54 విల్లాలు అక్రమంగా నిర్మించారు. మూడు ఎకరాల దీవిలో కట్టుకుంటామని అనుమతులు తెచ్చుకున్నారు. అడిగేవారు లేకపోవడంతో దాన్ని పది ఎకరాలకు విస్తరించారు. ఇది ఏకంగా రూ. 200 కోట్ల ఆస్తి. పదెకరాలకు విస్తరించడం ఏంటని అడిగిన అమాయక మత్స్యకారులపై ఉక్కుపాదం మోపారు. కానీ ఓ ఐదుగురు యువకులు మాత్రం కోర్టుల చుట్టు తిరిగి విల్లాలను కూల్చేసే విధంగా తీర్పు తెచ్చుకున్నారు. సమస్యంతా ఇక్కడే వాటిని అమలు చేసే అధికారి ఎవ్వడని. కానీ ఈసారి అలెప్పీ కలెక్టర్‌గా అక్కడకు వచ్చింది 2018 వరదలు వచ్చినప్పుడు అదే అలెప్పీలో అణువణువూ తిరిగిన అధికారి కృష్ణతేజ. చేతిలో సుప్రీం కోర్టు ఆర్డర్సు ఉంటే ఇంకెవ్వడికి భయపడాలి అన్నట్లు కృష్ణతేజ వ్యవహరించారు. ఒక్క పైసా కూడా ప్రజల ఖర్చు లేకుండా మొత్తం ఓనర్లతోనే డబ్బు కక్కించి 54 విల్లాలు కుప్పకూలేలా చేశారు కృష్ణతేజ. అలెప్పీలో రిసార్టు మాఫియాను తరిమికొట్టారు. కొవిడ్ కారణంగా తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రెటీల ద్వారా చదువుకు సాయం అందించి అక్కడి పిల్లలకు కలెక్టర్ మామన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎంత మంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్ చేశారో లెక్కనే లేదు. అక్కడ పిల్లల దృష్టిలో ఆయన హీరో. ప్రజల దృష్టిలో సమర్థవంతమైన అధికారి.