పెళ్లి చేస్తేనే చదువుకుంటానని 13 ఏండ్ల బాలుడు అల్టిమేటం.. తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసిన పేరెంట్స్
పిల్లలు పెళ్లి ఆటలు ఆడడం సహజమే. ఈ ఇద్దరు పిల్లలు మాత్రం నిజంగానే పెళ్లి చేసుకున్నారు. వారి తల్లిదండ్రులకు అల్టిమేటం వేసి.. వివాహం జరిపించుకున్నారు.

ఇస్లామాబాద్ : తెలిసీ తెలియని వయసులో పిల్లలు పెళ్లి ఆటలు ఆడడం సహజమే. కానీ ఈ ఇద్దరు పిల్లలు మాత్రం నిజంగానే పెళ్లి చేసుకున్నారు. అదేదో దొంగచాటుగా కాదు.. వారి తల్లిదండ్రులకు అల్టిమేటం వేసి.. అంగరంగ వైభవంగా వివాహం జరిపించుకున్నారు. ఇది చదవడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ వాస్తవం.
పాకిస్తాన్‌కు చెందిన ఓ 13 ఏండ్ల బాలుడు.. ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ బాలిక వయసు 12 ఏండ్లు. ఇక ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి.. నిర్భయంగా తన ఇంట్లో చెప్పేశాడు. ఫలానా అమ్మాయితో తన పెళ్లి జరిపించాలని, అప్పుడే చదువుకుంటానని తల్లిదండ్రులకు అల్టిమేటం వేశాడు.
చేసేదేమీ లేక పేరెంట్స్ కూడా ఆ పిల్లాడి డిమాండ్‌కు తలొగ్గారు. తమ కుమారుడు ఇష్టపడ్డ బాలికతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ బాల్య వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా బాలిక తల్లి మాట్లాడుతూ.. తన బిడ్డకు 12 ఏండ్లకు పెళ్లి చేశానన్న బాధ తనకు లేదన్నారు. అలా అంటే తన పెళ్లి 16 ఏండ్లకే అయిందన్నారు. బాలుడి తల్లికి కూడా 25 ఏండ్ల వయసులో వివాహమైంది. ఆమె కూడా తన కుమారుడికి త్వరగా వివాహం చేయాలని నిర్ణయించుకుని, ముందడుగు వేసిందని బాలిక తల్లి తెలిపారు. నవ వధువుకు బహుమతిగా ఐఫోన్ 15 ఇవ్వాలని వరుడు నిర్ణయించుకున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఇక పాకిస్తాన్ చట్టాల ప్రకారం అబ్బాయిలకు 18 ఏండ్లు, అమ్మాయిలకు 16 ఏండ్లు నిండితేనే వివాహం చేసుకునేందుకు అర్హులు. సింధు ప్రావిన్స్‌లో 2013లో స్త్రీపురుషులకు కనీస వివాహ వయసు 18 ఏండ్లుగా నిర్ణయిస్తూ చట్టాన్ని తయారు చేశారు. కానీ ఆ చట్టం ఆచరణలోకి రాలేదు.