బోరు బావిలో పడ్డ రెండేండ్ల బాలుడు
ఓ రెండేండ్ల బాలుడు ఆడుకుంటూ ఓ బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని జామ్‌నగర్ పరిధిలోని గోవనా గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.

జామ్‌నగర్ : ఓ రెండేండ్ల బాలుడు ఆడుకుంటూ ఓ బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని జామ్‌నగర్ పరిధిలోని గోవనా గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు బోరు బావి వద్ద సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. బాలుడు నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో బోరు బావిలో పడినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. వడోదర నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రప్పించామని, బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ ఏడాది జనవరిలో గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో మూడేండ్ల బాలిక బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే. బాలికను బోరు బావిలో నుంచి బయటకు తీసి, ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఎనిమిది గంటల పాటు శ్రమించి, బాలికను బయటకు తీశారు.