Salman Controversy | బలూచిస్తాన్, పాకిస్తాన్ పేర్లను వేర్వేరుగా ప్రస్తావించిన సల్మాన్
రియాద్‌లో జరిగిన జాయ్ ఫోరం 2025లో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్, పాకిస్తాన్ పేర్లను వేర్వేరుగా ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో చర్చలు చెలరేగాయి. ఇది స్లిప్ ఆఫ్ టంగా? లేక ఉద్దేశపూర్వకమా అన్న ప్రశ్నలతో నెటిజన్లు విడిపోయారు.

Salman Khan’s Balochistan Remark Sparks Controversy | Slip Of Tongue Or Political Hint?
(విధాత వినోదం డెస్క్)
హైదరాబాద్:
Salman Controversy | బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన ఒక వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ‘జాయ్ ఫోరం 2025’ లో పాల్గొన్న ఆయన, బలూచిస్తాన్, పాకిస్తాన్ పేర్లను వేర్వేరుగా ప్రస్తావించడంతో వేదికపై ఉన్నవారు ఆశ్చర్యపోయారు. సల్మాన్ తోపాటు షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సల్మాన్ మాట్లాడుతూ భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని పేర్కొన్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో భారతీయ సినిమాల ప్రాధాన్యంపై మాట్లాడుతుండగా ఆయన “ఇప్పుడు ఇక్కడ (సౌదీ అరేబియాలో) ఒక హిందీ సినిమా విడుదల చేస్తే అది సూపర్‌హిట్ అవుతుంది. తమిళం, తెలుగు, మలయాళ సినిమాలు కూడా కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తాయి. ఎందుకంటే ఇక్కడ చాలా దేశాల నుంచి ప్రజలు వచ్చి పనిచేస్తున్నారు… బలూచిస్తాన్ నుంచి, అఫ్గానిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచీ ఉన్నారు…” అని అన్నారు.
I don’t know if it was slip of tongue, but this is amazing! Salman Khan separates “people of Balochistan” from “people of Pakistan” .
pic.twitter.com/dFNKOBKoEz— Smita Prakash (@smitaprakash) October 19, 2025
ఇదే మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెలరేగుతున్నాయి. బలూచిస్తాన్‌ను వేరే దేశంగా ప్రస్తావించడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇది కేవలం స్లిప్ ఆఫ్ టంగ్ (నోట తప్పిన మాట) అని చెబుతుండగా, మరికొందరు “ఇది ఉద్దేశపూర్వక వ్యాఖ్య కావచ్చు. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తించాలన్న ఆలోచనతో ఆయన మాట్లాడి ఉండవచ్చు” అని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రసిద్ధ జర్నలిస్టు స్మితా ప్రకాశ్ ఆ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ “ఇది నాలుక మడతపడిందా? లేక ఉద్దేశపూర్వకంగా అన్నారా? సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ నుంచి వేరు చేశారు!” అని రాశారు. మరికొందరు యూజర్లు “సల్మాన్ ఖాన్‌కి భౌగోళిక అవగాహన ఉందా?” అంటూ సరదాగా కామెంట్లు పెట్టగా, బలూచ్ యూజర్లు మాత్రం ఆయన మాటలకు మద్దతు తెలిపారు.
ఒక యూజర్ జస్మిన్ అహ్మద్ “సల్మాన్ ఖాన్ చెప్పిన మాటలకు పెద్ద అర్థం ఉంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ ప్రావిన్స్ కాదు. అది ఒక స్వతంత్ర జాతి,” అని రాశారు. మరొక బలూచ్ యూజర్ జబీర్ బాలూచ్ “సల్మాన్ కూడా బలూచిస్తాన్ స్వతంత్రతను అంగీకరించారు” అని అన్నారు.
ఇక మరోవైపు, కొందరు నెటిజన్లు “సినీ నటుల దగ్గర అంత భౌగోళిక అవగాహనను ఆశించడం కాస్త ఎక్కువే. అది అనుకోకుండా నోట జారిన మాట కావచ్చు,” అని అభిప్రాయపడ్డారు. అయితే సల్మాన్ ఖాన్ లేదా ఆయన టీమ్ ఇప్పటివరకు ఈ వివాదంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
బలూచిస్తాన్ సమస్య నేపథ్యం:
బలూచిస్తాన్ పాకిస్తాన్‌లోనే అతిపెద్ద ప్రాంతం. గ్వాదర్ పోర్ట్ సహా చైనా-పాక్ ఆర్థిక కారిడార్‌లో ఇది కీలక కేంద్రం. కానీ 1948లో పాకిస్తాన్‌లో విలీనం అయినప్పటినుంచీ ఈ ప్రాంతం అస్థిరంగా ఉంది. అక్కడి బలూచ్ తెగలు తమను వేరే జాతిగా భావిస్తూ, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం వారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, చైనా ప్రాజెక్టులు తమ భూములను దోచుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంతో సల్మాన్ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసాయి.