Diwali Sweets to Delivery Agents | దీపావళిని డెలివరీ హీరోలతో పంచుకున్న హైదరాబాద్ యువకుడు
దీపావళిని డెలివరీ బాయ్స్‌తో పంచుకున్న హైదరాబాద్ యువకుడు గుండేటి మహేందర్ రెడ్డి. స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ యాప్స్ ద్వారా స్వీట్స్ ఆర్డర్ చేసి, వాటినే డెలివరీ చేసిన వారికే బహుమతిగా అందజేశాడు.

Hyderabad Man Gifts Sweets To Delivery Agents On Diwali | Swiggy Blinkit Zepto Gesture Goes Viral
(విధాత సిటీ బ్యూరో), హైదరాబాద్:
Diwali Sweets to Delivery Agents | దీపావళి అనగానే మనందరికీ వెలుగులు, బహుమతులు, కుటుంబసభ్యుల ఆనందం గుర్తుకొస్తుంది. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఈ పండుగను కొంచెం భిన్నంగా జరుపుకున్నాడు. గుండేటి మహేందర్ రెడ్డి అనే డిజిటల్ క్రియేటర్ ఈసారి దీపావళిని నగరంలోని డెలివరీ బాయ్స్ కోసం ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమంగా మార్చాడు.
స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ ద్వారా స్వీట్స్ ఆర్డర్ చేసి డెలివరీ బాయ్స్‌కే అందజేత
మహేంద్రరెడ్డి స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటి ఫుడ్ మరియు గ్రాసరీ యాప్స్ ద్వారా స్వీట్స్ బాక్స్‌లు ఆర్డర్ చేశారు. అయితే ఆ స్వీట్స్‌ను తాను తినకుండా, ఆ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ పార్ట్‌నర్స్‌కే తిరిగి బహుమతిగా ఇచ్చేశాడు. ఆ సమయంలో తీసిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది క్షణాల్లోనే వైరల్ అయ్యింది.
ఆ వీడియోలో ప్రతి డెలివరీ ఏజెంట్‌కి స్వీట్స్ బాక్స్‌ను అందజేస్తూ “హ్యాపీ దీపావళి బ్రదర్” అని చెబుతున్న మహేందర్ రెడ్డి చిరునవ్వు, ఆ డెలివరీ బాయ్స్ కళ్లలో కనబడిన ఆనందం నెటిజన్ల హృదయాలను కరిగించాయి. వీడియోపై టెక్స్ట్‌లో “ఈ దీపావళికి మేము స్వీట్స్ ఆర్డర్ చేశాం… కానీ వాటిని మాకు డెలివరీ చేసిన వారికే బహుమతిగా ఇచ్చేశాం” అని రాశాడు.
“వారి ముఖాల్లో చిరునవ్వు తెప్పించడం నా దీపావళి ఆనందం” – మహేందర్ రెడ్డి
పోస్ట్‌కు జతగా ఆయన “ఈసారి మా డెలివరీ హీరోల చిరునవ్వే మా దీపావళి ఆనందం. ఈ వీడియో ఎలాంటి ప్రచారం కోసం కాదు. ఇతరులు కూడా ఇలాంటి చిన్నచిన్న మానవతాచర్యలు చేపట్టాలని ప్రేరణ కలిగించడమే నా ఉద్దేశం” అని పేర్కొన్నారు.
View this post on Instagram
కొంతమంది ఈ వీడియో ‘వ్యూస్ కోసం చేశారని’ కామెంట్ చేయగా, మహేందర్ రెడ్డి సమాధానంగా “వ్యూస్ కోసం కాదు. మీరు కనీసం పది మందికి చిరునవ్వు తెప్పించండి. ఆ తర్వాత నేను ఈ వీడియో డిలీట్ చేస్తాను” అని స్పష్టంగా చెప్పారు.
ఈ స్ఫూర్తిదాయక చర్యపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇతరులు కూడా ఇలాగే చేస్తే ఎంత బాగుంటుంది!”, “చివరి డెలివరీ బాయ్ లేచి నమస్కారం చేయడం వారి ఆనందాన్ని ప్రదర్శించింది” వంటి కామెంట్లు వస్తున్నాయి.
గతంలో కూడా హైదరాబాద్‌లోని ఇద్దరు వ్లాగర్లు స్విగ్గీ, బ్లింకిట్ ఏజెంట్లకు గిఫ్ట్ బాక్స్‌లు ఇవ్వడం ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. కానీ మహేంద్రరెడ్డి వీడియోలో ఉన్న సహజత్వం, మానవత్వం ప్రత్యేకంగా నిలిచింది.
సాధారణంగా మనం బహుమతులు మన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇస్తాం. కానీ ఈ యువకుడు తన పండుగను మనకు సేవ చేసే, తరచూ ఎండనకా, వాననకా కష్టపడేవారితో పంచుకున్నాడు. అలా, వారి ముఖాల్లో కనిపించిన చిరునవ్వే నిజమైన దీపావళి వెలుగని ఆయన నిరూపించాడు.