Fake ORS | నకిలీ ఓఆర్‌ఎస్ డ్రింకులపై అలుపెరుగని పోరాటం – డా. శివరంజని చారిత్రక విజయం
హైదరాబాద్ వైద్యురాలు డాక్టర్ శివరాంజనీ సంతోష్ ఎనిమిదేళ్ల పోరాటంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చివరికి నకిలీ ‘ORS’ పానీయాలపై నిషేధం విధించింది. WHO ప్రమాణాలు పాటించని ఏ పానీయానికీ ఇకపై ‘ORS’ పేరు వాడరాదు. పిల్లల ప్రాణాలను కాపాడిన ఈ తీర్పు ఆరోగ్యరంగానికి పెద్ద విజయంగా నిలిచింది.

Hyderabad Doctor Wins 8-Year Battle: FSSAI Bans Misleading ‘ORS’ Drinks
హైదరాబాద్‌కు చెందిన శిశు వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ ఎనిమిదేళ్లుగా నడిపిన నిరంతర పోరాటం దేశ ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక మార్పుని తెచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన ప్రమాణాలను పాటించని ఏ ఆహార లేదా పానీయ ఉత్పత్తిపై ‘ORS’ (Oral Rehydration Salts) అనే పదాన్ని వాడకూడదని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) అక్టోబర్ 14న కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుతో 2022, 2024లో జారీ చేసిన సడలింపులు పూర్తిగా రద్దయ్యాయి. ఇకపై ‘ORS’ అని లేబుల్ వేసే హక్కు కేవలం WHO ఫార్ములా ప్రకారం తయారైన ద్రావణాలకే ఉంటుంది.
నిజమైన ఓఆర్‌ఎస్ అంటే ఏమిటి?
WHO నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం, ఓఆర్‌ఎస్ ద్రావణంలో ఒక్క లీటర్ నీటిలో కింది లవణాలు ఉండాలి.
- సోడియం క్లోరైడ్ : 2.6 గ్రా
- పొటాషియం క్లోరైడ్ : 1.5 గ్రా
- ట్రైసోడియం సిట్రేట్ : 2.9 గ్రా
- గ్లూకోజ్ (అన్హైడ్రస్) : 13.5 గ్రా
ఈ సమతుల్యం వల్లే శరీరంలో కోల్పోయిన నీరు, ఉప్పు, ఎలక్ట్రోలైట్లు తిరిగి చేరుతాయి.
అయితే మార్కెట్లో “ORS-L”, “Rebalanz-VitORS”, “ORSFIT” వంటి పేర్లతో అమ్మబడుతున్న పానీయాలు లీటరుకు 100 గ్రాములకు పైగా చక్కెర కలిగి ఉండేవి. అంటే WHO ఫార్ములాలో ఉన్నదానికంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ చక్కెర!
డాక్టర్ శివరంజని వివరించినట్లు, “ఈ పానీయాలు నిజానికి శరీరానికి నీటిని అందించకుండా, మరింతగా విరేచనాలను తీవ్రతరం చేస్తాయి. అంటే ప్రాణరక్షణి అనే పేరు మీద పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.” అని డాక్టర్ శివరంజని వివరించింది.
వైద్యురాలు గుర్తించడంతో మొదలైన యుద్ధం
2015లోనే ఆమె తన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలలో ఒక విచిత్ర పరిస్థితిని గమనించారు. “విరేచనాలతో వచ్చిన పిల్లలు ‘ORS’ తాగిన తర్వాత మరింతగా బలహీనమవుతున్నారు,” అని ఆమె గుర్తించారు. పరిశీలించగా వారు తాగింది ‘ORS-L’ అనే ఫ్లేవర్ డ్రింక్, కానీ అది అసలు WHO ప్రమాణాలకు దూరంగా ఉంది. తదుపరి ఆమె 2017లో పూర్తి సాక్ష్యాలతో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కు లేఖ రాసి హెచ్చరించారు. వారు “ఇది మా పరిధిలోకి రాదు” అంటూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి పంపారు. కానీ చర్య లేకపోవడంతో ఆమె 2022లో తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.
బాన్–రద్దు–మళ్లీ బాన్ : అయోమయం నుంచి స్పష్టత
2022 ఏప్రిల్ 8న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఒక సర్క్యులర్ విడుదల చేసి — ‘WHO ఫార్ములా కాకుండా ఉన్న ఏ ఉత్పత్తీ ORS అనే పదం వాడకూడదు’ అని స్పష్టం చేసింది. కానీ రెండు నెలల్లోనే, 2022 జూలై 14న, ఆ ఆదేశాన్ని వెనక్కు తీసుకుంది.
పాత బ్రాండ్లకు “ORS” పేరును కొనసాగించవచ్చని, కానీ చిన్న డిస్క్లెయిమర్ పెట్టాలని అనుమతిచ్చింది. 2024 ఫిబ్రవరిలో మరలా సడలింపులు ఇచ్చి కొత్త బ్రాండ్లకు కూడా అదే అనుమతి ఇచ్చింది. కానీ ఆ డిస్క్లెయిమర్ అచ్చం చీమపరిమాణంలో ఉండటంతో ప్రజలు గుర్తించలేకపోయారు.
ఈ అవగాహన రాహిత్యం వల్ల అనేకమంది పిల్లలు, ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ప్రమాదంలో పడ్డారని డాక్టర్ శివరంజని వివరించారు.
ఎనిమిదేళ్ల ధైర్యమైన పోరాటం
“నా మాట వినకపోవడంతో నేను సామాజిక మాధ్యమాల్లో నా బాధను పంచుకున్నాను. వేలాదిమంది తల్లులు, వైద్యులు, జర్నలిస్టులు మద్దతుగా నిలబడ్డారు. ఇది నా వ్యక్తిగత విజయం కాదు — ప్రజల విజయం,” అని ఆమె చెప్పారు.
ఆమె PILలో కేంద్ర ఆరోగ్య శాఖ, FSSAI, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, కెన్వ్యూ వంటి పెద్ద సంస్థలు ప్రతివాదులుగా ఉన్నారు. ఎండ్‌క్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఉమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరమ్ వంటి వైద్య సంస్థలు కూడా ఆమెకు మద్దతు ఇచ్చాయి. “నా కుటుంబం భయపడ్డా నేను వెనక్కు తగ్గలేదు. స్పాన్సర్‌షిప్ తీసుకున్న కొన్ని వైద్య సంఘాలు కూడా నన్ను విమర్శించాయి, కానీ నేను ఆగలేదు,” అని ఆమె అన్నారు.
- పిల్లలకూ మధుమేహ రోగులకూ ప్రమాదం
డాక్టర్ శివరంజని సూచించినట్లు —
“ఒక డయాబెటిస్ రోగి ఈ నకిలీ ‘ORS’ తాగితే అతని రక్తంలో చక్కెర తక్షణం పెరిగిపోతుంది. డీహైడ్రేషన్ మరింత తీవ్రతరం అవుతుంది. ఈ సమస్యతో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో దశాబ్దాల కేసులు చూశాం.” చాలా చిన్న పిల్లల మరణాలు “డయేరియా డెత్”గా నమోదవుతాయి, కానీ అసలైన కారణం ఈ అధిక చక్కెర పానీయమనే విషయం బయటకు రాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
- వైద్య నిపుణుల హెచ్చరికలు
డాక్టర్ పంకజ్ గార్గ్ (ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ – ఢిల్లీ చాప్టర్) మాట్లాడుతూ,
“ఓఆర్‌ఎస్ అంటే సరైన నీరు, ఉప్పు, చక్కెర నిష్పత్తి కలిగిన సూత్రం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే రోగి ప్రాణానికే ప్రమాదం,” అన్నారు. పద్మశ్రీ డాక్టర్ మోహ్సిన్ వాలి కూడా హెచ్చరించారు – “ఈ చక్కెర డ్రింకులు తాత్కాలిక రిలీఫ్ ఇవ్వొచ్చు కానీ శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యాన్ని చెడగొడతాయి. WHO ఫార్ములా తప్ప మరోదాన్ని వాడకూడదు.”
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాజా ఉత్తర్వు ఒక కీలక పాఠాన్ని నేర్పింది — ‘వాణిజ్య ప్రయోజనాల కోసం వైద్య పదాలను వాడకూడదు.’
డాక్టర్ శివరంజని చివరిగా చెప్పిన మాట — “ఓఆర్‌ఎస్ మందు, మార్కెటింగ్ బ్రాండ్ కాదు. ప్రతి సారి మీరు ORS కొంటున్నప్పుడు, లేబుల్ తప్పక చూడండి — WHO recommended formula అని ఉండాలి.”
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ణయం ఒక వ్యక్తిగత విజయం కంటే ఎక్కువ — డాక్టర్ శివరంజని అలుపెరుగని నిస్వార్థ పోరాట ఫలితం భారత ప్రజల విజయం. అయితే ఎవరోఒకరు పోరాడితే తప్ప ఈ ప్రభుత్వాలు మేల్కొనకపోవడం శోచనీయం. మందుల విషయంలో విదేశాలు పాటిస్తున్నఅత్యంత కఠిన ప్రమాణాలు నెలకొల్పాలి. ఓవర్ ది కౌంటర్ అమ్మకాలు నిషేధించాలి. వైద్యుడి సిఫారసు లేకుండా పారాసెటమాల్ కూడా ఇవ్వకూడదు. ఇవన్నీ పాటించినపుడే కనీసం మందుల వల్ల కలిగే దుష్పరిణామాలను నివారించవచ్చు. డా. శివరంజని కనుక ఈ పోరాటం చేయకపోతే, జరగబోయే శిశుమరణాలు తలుచుకుంటే భయమేస్తుంది.