2018 ఎన్నికల్లో 675 మంది ఇండిపెండెంట్లు పోటీ.. గెలిచింది మాత్రం ఒక్కరే..

Telangana Assembly Elections | ఎన్నికలు రాగానే.. ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకునేందుకు ఆయా పార్టీల నాయకులు పోటీ పడుతుంటారు. టికెట్లు, బీ ఫామ్స్ దక్కకకపోతే రెబల్స్‌గా మారిపోతారు. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులగా బరిలో దిగి ప్రధాన పార్టీల నాయకులకు గట్టి పోటీనిస్తారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న వారు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుంటారు.
2018 ఎన్నికల్లో తెలంగాణలో 675 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. కానీ ఒకే ఒక్క అభ్యర్థి మాత్రమే విజయం సాధించారు. ఆ ఒక్కరు ఎవరంటే వైరా ఎమ్మెల్యే లవుడ్యా రాములు నాయక్. బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్‌పై రాములు నాయక్ గెలిచారు. కాంగ్రెస్ రెబల్‌గా రాములు నాయక్ పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాములు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లో రాములుకు 52,650 ఓట్లు పోలవ్వగా, మదన్‌లాల్‌కు 50,637 ఓట్లు పోలయ్యాయి.
ఇక పోటీ చేసిన 675 మంది స్వతంత్ర అభ్యర్థులకు 6,73,609 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఓటింగ్ శాతం 3.25 శాతంగా నమోదైంది. బెల్లంపల్లి, హుజుర్‌నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కే వేణుప్రకాశ్, ఎం రఘుమారెడ్డి, డీఎస్ నాయక్ .. మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. మల్కాజ్‌గిరి, మిర్యాలగూడ, ఉప్పల్ నియోజకవర్గాల్లో అత్యధికంగా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. మల్కాజ్‌గిరిలో 19 మంది, మిర్యాలగూడలో 18, ఉప్పల్‌లో 15 మంది బరిలో దిగారు.