Suicide | హృదయ విదారకం.. ఒకే కుటుంబంలో ఏడుగురి ఆత్మహత్య

Suicide | ఇది హృదయ విదారక ఘటన.. ఒకే కుటుంబంలో ఏడుగురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటి యజమాని ఉరేసుకోగా, మిగతా వారంతా విజతజీవులై కనిపించారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని పాలన్‌పూర్‌లో మనీష్ సోలంకి(37) తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. మనీష్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్. అయితే మనీష్ పేరెంట్స్, భార్యాపిల్లలు ఇంట్లో విగతజీవులై కనిపించారు. మనీష్ ఇంట్లోనే సీలింగ్‌కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను మనీష్, ఆయన తల్లిదండ్రులు కను సోలంకి, శోభ, భార్య రీతా, పిల్లలు కౌశల్, దిశ, కావ్యగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పిల్లలకు పదేండ్ల లోపు వయసు ఉంటుంది.
ఇలా వెలుగులోకి..
మనీష్ కాంట్రాక్టర్ కావడంతో ఆయన వద్ద 35 మంది కార్పెంటర్లు, ఇతర వర్కర్లు పని చేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే మనీష్‌కు అతని వద్ద పని చేసే వర్కర్లు ఫోన్ చేస్తున్నారు. కానీ స్పందించ లేదు. దీంతో వర్కర్లు ఇంటికి వచ్చి తలుపులు కొట్టగా తెరవలేదు. అనుమానంతో కిటికీలు తెరిచి చూడగా, మనీష్ సీలింగ్‌కు ఉరేసుకున్నాడు. మిగతా కుటుంబ సభ్యులు విగతజీవులుగా కనిపించారు.
సూసైడో నోట్ లభ్యం..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగానే చనిపోతున్నామని లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కొంతమంది డబ్బులు ఇవ్వాల్సి ఉందని, అవి తిరిగి చెల్లించకపోవడంతో, ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయని లేఖలో రాసిఉన్నట్లు పోలీసులు తెలిపారు. కానీ ఎవరి పేర్లు ఆ లేఖలో పేర్కొనలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.