Parrot | హైదరాబాద్‌లో ఎగిరిపోయిన చిలుక.. 24 గంటల్లోనే పట్టితెచ్చిన పోలీసులు

Parrot | పంజరం నుంచి ఎగిరిపోయిన ఓ చిలుకను 24 గంటల్లోనే పోలీసులు గుర్తించి, యజమానికి అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 24న చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నం.44లో నివసించే నరేంద్రచారి మైరు బిస్ట్రో కాఫీ షాపు నిర్వహిస్తున్నాడు. ఆస్ట్రేలియా జాతికి చెందిన గాలా రాక్టో అనే 4 నెలల వయసున్న చిలుకను రూ. 1.30 లక్షలకు కొనుగోలు చేసి పెంచుకుంటున్నాడు నరేంద్రచారి. అయితే గత నెల 24వ తేదీన ఆ చిలుకకు ఆహారం పెట్టేందుకు దాని పంజరం తెరిచాడు. ఈ సమయంలో చిలుక ఎగిరిపోయింది.
అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ చిలుక ఫోటోను ఎస్ఐ ముత్యాల మెహర్ రాకేశ్.. స్థానిక పక్షులు, జంతువుల విక్రయ దుకాణదారులకు పంపారు. అయితే ఆ చిలుకను ఎర్రగడ్డలో రూ. 30 వేలకు ఓ వ్యక్తి విక్రయించినట్లు తేలింది. రూ. 30 వేలకు కొనుగోలు చేసిన వ్యక్తి.. మర్నాడు రూ. 50 వేలకు సయ్యద్ ముజాహిద్‌కు విక్రయించాడు. ఈ చిలుకను రూ, 70 వేలకు విక్రయిస్తానని ముజాహిద్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. దీంతో జూబ్లీహిల్స్‌లోని పెట్ షాపు నిర్వహకుడు ఎస్ఐకి సమాచారం అందించడంతో 25న చిలుకను స్వాధీనం చేసుకుని, నరేంద్రచారికి అప్పగించారు. నరేంద్రచారి పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.