త‌న‌ని ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై ఎట్ట‌కేల‌కి స్పందించిన సంజూ.. అదృష్ట‌వంతుడినే అంటూ కామెంట్

త‌న‌ని ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై ఎట్ట‌కేల‌కి స్పందించిన సంజూ.. అదృష్ట‌వంతుడినే అంటూ కామెంట్

భార‌త వికెట్‌కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌కి ఎందుకో బ్యాడ్ టైమ్ న‌డుస్తుంది. త‌న‌కు ద‌క్కిన ప్ర‌తి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన కూడా ఎందుకో సెల‌క్ట‌ర్స్ అత‌న్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేదు. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించే శాంసన్‌కు జాతీయ జట్టులో మాత్రం అవ‌కాశాలు అంత‌గా రావ‌డం లేదు. ఒక‌వేళ వ‌చ్చిన కూడా ఒక‌టి రెండు మ్యాచ్‌లు విఫ‌లం అయితే త‌దుప‌రి టోర్నీకి ప‌క్క‌న పెట్టేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో జరిగిన వన్డే ప్రపంచకప్, అంతకుముందు ఆసియా కప్, ఆసియన్ గేమ్స్‌లో కూడా సంజూ శాంస‌న్‌ని ఏ మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. దీంతో బీసీసీపై చాలా మంది ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు.

అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఆడుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సైతం సంజూ శాంస‌న్‌ణి దూరం పెట్టారు. దీంతో బీసీసీఐపై చాలా మంది నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం సంజూను ఎంపిక చేయకపోవటాన్ని తప్పుబట్టాడు. 2021లో వన్డేలలో అరంగేట్రం చేసిన సంజూ శాంసన్ ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడి 390 ర‌న్స్ చేశాడు. మంచి టాలెంట్‌, అద్భుత‌మైన టైమింగ్ ఉన్న సంజూ శాంస‌న్‌ని ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పక్కనబెట్టడంపై అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ వ‌స్తున్నాయి. దీనిపై స్పందించిన సంజూ శాంస‌న్.. ధన్య వర్మ యూట్యూబ్ ఛానెల్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

“ప్రజలంతా నన్ను అన్ లక్కీ క్రికెటర్ అంటుంటారు. కానీ ప్రస్తుతం నేను ఎక్కడైతే ఉన్నానో.. అది నేను అనుకున్న స్థాయి కంటే చాలా ఎక్కువ అని, ప్ర‌స్తుతం క్రికెట‌ర్‌గా తాను ఉన్న స్థాయి ప‌ట్ల సంతోషంగా ఉన్నాన‌ని అన్నాడు. నాకు తెలిసీ నా దగ్గరకు వచ్చి మాట్లాడిన మొదటి లేదా రెండో వ్యక్తి రోహిత్ శర్మే. ఐపీఎల్‌లో నువ్వు చాలా బాగా ఆడావ్. ముంబై ఇండియన్స్‌పై చాలా సిక్సర్లు కొట్టావ్. నువ్వు చాలా బాగా బ్యాటింగ్ చేస్తావ్ అంటూ రోహిత్ శర్మ ప‌లుమార్లు అభినందించాడు. అత‌ని నుండి నాకు చాలా మ‌ద్దతు ల‌భించింది అని సంజూ శాంస‌న్ అంటున్నాడు. ఇక మ‌నోడు చివ‌రిగా ఈ ఏడాది ఆగస్టులో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ఆడాడు. ఆసియాకప్ 2023 కోసం రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఎంపికైన అత‌నికి తర్వాత మెన్ ఇన్ బ్లూ తరుఫున ఆడే అవకాశం ఇంత వ‌ర‌కు ద‌క్క‌లేదు. ఈ 29 ఏళ్ల కేర‌ళ క్రికెట‌ర్‌కి రానున్న రోజుల‌లో అయిన అదృష్టం త‌లుపు త‌డుతుందేమో చూడాలి.