యూటీగా హైదరాబాద్‌ నగరాన్ని చేస్తారేమో!

భవిష్యత్తులో హైదరాబాద్‌, ముంబై, చెన్నై, కోల్‌కతాను కూడా కేంద్రం యూటీలుగా మార్చుతుందేమోనన్న అభిప్రాయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యక్తం చేశారు.

యూటీగా హైదరాబాద్‌ నగరాన్ని చేస్తారేమో!

కోల్‌కతా, ముంబై, చెన్నైకీ అదే తప్పదు

సుప్రీంకోర్టు తీర్పుపై అసదుద్దీన్‌ ఒవైసీ

ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పట్ల తాను సంతోషంతో లేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసినా ఆశ్చర్యం లేదని చెప్పారు. ‘ఈ నిర్ణయంతో మేం సంతృప్తిగా లేము. కశ్మీర్‌ అనేది భారతదేశంలో అంతర్భాగం. ఈ రోజు మూరు ఒక రాష్ట్రాన్ని మూడు కేంద్రపాలిత ప్రాంతాలు చేశారు. పార్లమెంటు వారికోసం మాట్లాడుతున్నది. కానీ.. వారి అసెంబ్లీ కాదు. లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇకదేన్నైనా ఇలానే చేయవచ్చు. ఇప్పుడు రాబోయే రోజుల్లో బీజేపీ హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాలను కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసే అవకాశం ఉన్నది. దానిని అడ్డుకునేవారూ ఎవరూ లేరు’ అని అసదుద్దీన్‌ ఒక ఆంగ్ల వార్తా సంస్థకు చెప్పారు.


370వ అధికరణం రద్దు అనేది రాజ్యాంగ నైతికతను ఉల్లంఘించడమేనని అసదుద్దీన్‌ అన్నారు. రాష్ట్రాన్ని మూడు కేంద్రపాలిత ప్రాంతాలు చేయడం కశ్మీర్‌ ప్రజలకు అతిపెద్ద ద్రోహమని అభివర్ణించారు. ‘కర్ఫ్యూ విధించి, ఎన్నికైన అసెంబ్లీ లేకుండా ఆర్టికల్‌ 370ని రద్దు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? కశ్మీర్‌ గురించి ఆలోచించింది ఎవరు?’ అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్య కారణంగా డోగ్రాలు, బౌద్ధులు లద్దాఖ్‌లో భవిష్యత్తులో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారని అసదుద్దీన్‌ అన్నారు.


ఇప్పటికే జమ్ములోని అన్ని రైస్‌మిల్లులు డోగ్రాల చేతి నుంచి వెళ్లిపోయాయిన చెప్పారు. జమ్ముకశ్మర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సబబేనని సోమవారం తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు.. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.