Black Friday Sale । నేటి బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ హంగామా! ఎక్కడెక్కడ ఎంత డిస్కౌంట్‌?

అగ్గువకు డీల్స్‌! వివిధ ఈకామర్స్‌ సంస్థలు బ్లాక్‌ ఫ్రై డే సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

Black Friday Sale । నేటి బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ హంగామా!  ఎక్కడెక్కడ ఎంత డిస్కౌంట్‌?

Black Friday Sale  : సవక.. సవక! బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ మళ్లీ వచ్చేసింది. నిన్న మొన్నటిదాకా కస్టమర్లకు పండుగ ఆఫర్లు ఇచ్చిన ఈ కామర్స్‌ పోర్టళ్లు.. ఇప్పడు ప్రతి శుక్రవారం బ్లాక్‌ ఫ్రేడే సేల్‌ పేరిట ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అమెజాన్‌, క్రోమా, హెచ్‌అండ్‌ఎం, నైకా, అజియో, జారా, విజయ్‌సేల్స్‌ తదితర సంస్థలు భారీ డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నాయి. బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ పేరిట భారీ అమ్మకాలు ఉంటాయని ఆశిస్తున్నాయి.


అమెరికా, బ్రిటన్‌, యూరప్‌లో ఈ బ్లాక్‌ఫ్రైడే సేల్‌తో క్రిస్మస్‌ షాపింగ్‌ సీజన్‌ మొదలవుతుంది. ఇదే క్రమంలో భారతదేశంలో కూడా దీన్ని ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి తెస్తున్నాయి. పశ్చిమ దేశాల్లో భారీ డిస్కౌంట్లకు బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ నిదర్శనంగా నిలుస్తున్నది. షాపింగ్‌లో ఆయా ఉత్పత్తులపై 50 శాతం నుంచి 70శాతం వరకూ డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తుంటారు. ఉచితంగా షిప్పింగ్‌, సులభంగా రిటర్న్‌ చేసే అవకాశం కల్పిస్తుంటాయి. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన ఐటమ్స్‌పై ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ ఆఫర్‌లు ఇస్తుంటాయి.


ఆయా సంస్థలు ఇస్తున్న ఆఫర్లను గమనిస్తే.. క్రోమా ఈ ఏడాది ఈ శుక్రవారం బీభత్సమైన డిస్కౌంట్లు ఇస్తున్నట్టు చెబుతున్నది. మరో విషయం ఏమిటంటే.. తన డీపెస్ట్‌ బ్లాక్‌ఫ్రైడే సేల్‌ను ఆదివారం వరకూ కొనసాగించనున్నది. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, స్మార్ట్‌ ఫోన్లు, గృహోపకరణాలు, ఇతర గ్యాడ్జెట్స్‌పై భారీ ఆఫర్లు ఇస్తున్నది. వినియోగదారులను ప్రోత్సహించేందుకు పలు రకాల డిస్కౌంట్‌ కూపన్లు కూడా ఇస్తున్నది.


ఇక అమెజాన్‌ తనదైన శైలిలో డిస్కౌంట్లు ప్రకటిస్తున్నది. ట్యాబ్లెట్స్‌, స్పీకర్స్‌, వాచ్‌లు, ఫోన్లు, ల్యాప్‌టాప్ వంటివాటిపై డీల్స్‌ ప్రకటించింది.


నైకా కూడా పింక్‌ ఫ్రైడే సేల్‌ పేరిట మహిళలను, ప్రత్యేకించి యువతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. తక్కువ ధరలకు బ్యూటీ ప్రొడక్ట్స్‌ విక్రయిస్తున్నది. ఎం.ఏ.సి. బాబి బ్రౌన్‌, లాక్మే, న్యూయార్క్‌ సహా దాదాపు 2100 బ్రాండ్లపై ఈ ఏడాది 50శాతం వరకూ డిస్కౌంట్‌ ఇస్తున్నది. వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్లు కూడా కొన్నింటిపై ఉన్నాయి. ఇక అడిడాస్‌.. స్పోర్ట్స్‌ ఐటమ్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నది. కొన్నింటిపై 60 శాతం వరకూ రిబేటు ఇస్తున్నారు.


హెచ్‌అండ్‌ఎం కూడా ఫ్యాషన్‌ ఐటమ్స్‌పై 20 నుంచి 60శాతం వరకూ డిస్కౌంట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌లోనే కాదు.. ఆఫ్‌లైన్‌ సేల్స్‌లోనూ ఇవి వర్తిస్తాయని చెబుతున్నది. అజియో వివిధ రకాల వస్త్రాలపై 50 నుంచి 90 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నది. అంతేకాదు.. ఈ నెల 27 వరకూ ఈ ఆఫర్లు కొనసాగుతాయట. జారా సైతం వివిధ రకాల వస్త్రాలపై డిస్కౌంట్‌ సేల్‌ ప్రకటించింది. విజయ్‌సేల్స్‌ స్మార్ట్‌ వాచ్‌లతోపాటు.. ల్యాప్‌టాప్స్‌ తక్కువ ధరకే అమ్ముతున్నది. ఆపిల్‌ ఫోన్లపైనా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఇస్తున్నారు.