Digital Arrest | డిజిటల్ అరెస్టు పేరిట వృద్ధ దంపతుల రూ.15 కోట్లు హాంఫట్!
ప్రజలను పోలీసులు ఎంత చైతన్యవంతం చేస్తున్నా.. ఇంకా చాలా మంది సైబర్ మోసాలకు గురవుతూనే ఉన్నారు. డిజిటల్ అరెస్టులు అనేవి ఉండవని సైబర్ అధికారులు నెత్తీనోరు బాదుకుంటున్నా.. సైబర్ క్రిమినల్స్ వలకు చిక్కుకుని.. కోట్ల రూపాయలు కోల్పోతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన వృద్ధ జంట.. దాదాపు 14 కోట్లు పోగొట్టుకున్నది.
Digital Arrest | దేశంలో సైబర్ మోసాలపై పోలీసులు ఎంత ప్రచారం చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదా? లేకపోతే వారికి అవగాహన ఇంకా కలకగడం లేదా? అనేది అర్థం కాకుండా ఉంది. ప్రసార మాధ్యమాల్లో డిజిటల్ అరెస్టులపై వార్తలు వస్తున్నా చదివే తీరిక లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా తమ వ్యక్తిగత జీవితానికే పరిమితం కావడం మూలంగా జరగాల్సిన ఘోరాలు, నష్టాలు జరుగుతునే ఉన్నాయి. ఇందుకు తాజా ఉదాహారణ ఢిల్లీలో జరిగిన అతిపెద్ద డిజిటల్ అరెస్టు. అది కూడా ఒక గంటో రెండు గంటలో కాదు.. ఏకంగా రెండు వారాల పాటు జరిగిన డిజిటల్ అరెస్టు మోసంలో వృద్ధ దంపతులు ఒక కోటి రెండు కోట్లు కాదు సుమారు రూ.14.85 కోట్లు నష్టపోయారు. ఈ రెండు వారాల వ్యవధిలో ఎవరికైనా ఈ సమాచారం అందిస్తే.. బయటపడేవారు. కానీ.. ఈ ఘటన జరిగిన తరువాత తేరుకుని తాము మోసపోయామని ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్2 ప్రాంతంలో ఇందిరా తనేజా (77), ఓం తనేజా (81) ఎన్ఆర్ఐ దంపతులు నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 24వ తేదీన ఇందిరా తనేజాకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారిని అంటూ సైబర్ మోసగాడి నుంచి ఒక వీడియో కాల్ వచ్చింది. మీ ఫోన్ నెంబర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు జరిగాయని, మనీ ల్యాండరింగ్ జరిగిందని, బ్యాంకు ఖాతాలో నల్లధనం ఉందంటూ బెదిరింపులకు దిగాడు. ముంబైలోని కొలాబా పోలీసులతో మాట్లాడాలంటూ వీడియో కాల్ కాన్ఫరెన్స్ పెట్టాడు. కెనరా బ్యాంకులో ఖాతాలో అవకతవకలు జరిగాయని వివరించాడు.
ఈ వ్యవహారం ప్రాణానికి ముప్పు అని, ఈ విషయాలను ఎవరితో చెప్పుకోవద్దంటూ హెచ్చరించాడు. 26 మంది ఫిర్యాదు చేయడం మూలంగా మొబైల్ కనెక్షన్ రద్దు చేస్తున్నట్లు ట్రాయ్ పేరుతో మరో కాల్ వచ్చిందని ఇందిరా తనేజా తెలిపారు. మహారాష్ట్రలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అరెస్టు వారంట్ జారీ చేశారని సదరు వ్యక్తి వెల్లడించాడు. ఈ కేసును ముంబైలోని కొలబా పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారంటూ మోసగాడు వీడియో కాల్ లో తెలిపాడన్నారు. ఆ తరువాత పోలీసు యూనిఫామ్ తో ఉన్న విక్రాంత్ సింగ్ రాజ్ పుత్ అనే వ్యక్తి, లైన్‌లోకి వచ్చి.. తాము మనీ ల్యాండరింగ్ లో ఇరుక్కున్నారని తెలిపాడని ఆమె వివరించారు. ముంబై కెనరా బ్యాంకు బ్రాంచిలో మీ పేరు మీద ఖాతా తెరిచారని, దీని ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయన్నారు. నరేష్ గోయల్ అనే వ్యక్తి ఈ లావాదేవీలు జరిపారంటూ అతని ఫొటో చూపించగా, తానెప్పుడు చూడలేదని వారికి తెలిపానన్నారు. డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం నుంచి జనవరి 9వ తేదీ ఉదయం వరకు విడతల వారీగా వారి బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.14.85 కోట్లు బదలాయించుకున్నారు.
విచారణ పూర్తయిన తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తిరిగి మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరతాయని చెప్పారన్నారు. ఈ ఘటన నుంచి తేరుకున్న తరువాత తాము మోసపోయాని వృద్ధ దంపతులు గ్రహించారు. వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన మోసాన్ని పోలీసు అధికారులకు పూసగుచ్చి వివరించారు. డిజిటల్ అరెస్టు పేరుతో మానసికంగా భయాందోళనకు గురి చేసి ఆర్టీజీఎస్ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కొల్లగొట్టారని పోలీసులు నిర్థారణకు వచ్చారు. వృద్ధ దంపతుల గురించి పూర్తి సమాచారం సేకరించిన తరువాతే డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరింపులకు పాల్పడినట్లు అంచనాకు వచ్చారు. వివరాలు తీసుకున్న తరువాత ఈ కేసును ఢిల్లీ సైబర్ క్రైమ్ యూనిట్ కు బదిలీ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram