Cyber Crime | సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
Cyber Crime మన తెలంగాణ పుడ్స్ & ఎలక్ట్రికల్స్ పేరుతో మల్టీ లెవల్ బిజినెస్ అంతర్ రాష్ట్ర సైబర్ మోసగాడి అరెస్ట్ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసిన సిరిసిల్ల పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేసులు నమోదు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విధాత బ్యూరో, కరీంనగర్: ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ వ్యాపారాల పేరుతో అనేకమందిని నమ్మించి సుమారు […]

Cyber Crime
- మన తెలంగాణ పుడ్స్ & ఎలక్ట్రికల్స్ పేరుతో మల్టీ లెవల్ బిజినెస్
- అంతర్ రాష్ట్ర సైబర్ మోసగాడి అరెస్ట్
- బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసిన సిరిసిల్ల పోలీసులు.
- రాష్ట్ర వ్యాప్తంగా 19 కేసులు నమోదు
- వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
విధాత బ్యూరో, కరీంనగర్: ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ వ్యాపారాల పేరుతో అనేకమందిని నమ్మించి సుమారు 9 కోట్లమేర దండుకున్న సదరు వ్యక్తికి సంబంధించి బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కటుకోజ్వల రమేష్ ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ వేదికగా తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం అందిస్తామంటూ ప్రకటనలు చేసి
అనేకమందిని మోసగించినట్లు చెప్పారు.
ఇతనిపై 2018 లో జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలలో 8 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11 కేసులు నమోదై ఉన్నట్టు ఆయన తెలిపారు. గతంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసిన కేసులో రమేష్ చారి మీద పిడి యాక్ట్ నమోదు చేయడం జరిగిందన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో ప్రైవేట్ టీచర్ గా పనిచేసిన రమేష్ ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడన్నారు. తాను చేస్తున్న వృత్తి ద్వారా వచ్చే డబ్బు సరిపోక, సులువుగా డబ్బు సంపాదించడానికి ఆన్లైన్ మోసాలకు తెగపడ్డాడని చెప్పారు.
తన పేరిట ఫేస్బుక్ పేజీలో ఖాతా ప్రారంభించి, తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మకానికి పెట్టి అమాయకులను వస్తువుల కొనుగోలు వైపు ఆకర్షింప చేసేవాడని తెలిపారు. గత 14 నెలలుగా అనేకమందిని నమ్మించి పెద్ద మొత్తంలో తన ఖాతాల్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని వివరించారు.
ధర్మారం మండల కేంద్రంలోని ఎస్బీఐ, తెలంగాణా గ్రామీణ బ్యాంకు, యూనియన్ బ్యాంక్, కరీంనగర్ ఆక్సిస్ బ్యాంకు శాఖలలో తన వలలో పడిన అమాయకుల నుండి డబ్బు డిపాజిట్ చేయించుకుని, వాటిని తన వ్యాపార అవసరాలకు ఉపయోగించుకునేవాడని అన్నారు.
ఆన్లైన్ మోసాల కోసం హైదరాబాద్ ప్రగతినగర్ లో మన తెలంగాణ ఫుడ్స్, ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడని వివరించారు. రమేష్ చారి వల్ల మోసపోయిన ముస్తాబాద్ మండలానికి చెందిన ఆదర్శ్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
సీఐ సదన్ కుమార్, సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ జునైద్ లతో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా, సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి వస్తున్న విషయం తెలుసుకొని రమేష్ చారిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దర్యాప్తులో తెలంగాణ వ్యాప్తంగా సుమారు తొమ్మిది కోట్ల మేర రమేష్ లావాదేవీలు జరిపినట్టు వెల్లండైందన్నారు. దీంతో ఆయనకు సంబంధించిన నాలుగు బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయడం జరిగిందన్నారు.
ప్రజలు సైబర్ మోసాల పట్ల, మల్టీ లెవల్ బిజినెస్ చేసే వారికి దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే ఉద్యోగ, వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. రమేష్ చారిని అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్, ఎస్‌ఐ జునైద్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ ఉదేయ్ రెడ్డి, సీఐ సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.