GHIAL | శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సింగ‌పూర్, కొలంబోకు డైరెక్ట్ ఫ్లైట్స్

GHIAL | శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సింగ‌పూర్, కొలంబోకు డైరెక్ట్ ఫ్లైట్స్

హైద‌రాబాద్ : సింగ‌పూర్, కొలంబో వెళ్లాల‌నుకునే ప‌ర్యాట‌కుల‌కు, ఇత‌రుల‌కు జీహెచ్ఐఏఎల్ శుభ‌వార్త వినిపించింది. ఇక‌నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సింగ‌పూర్, కొలంబోకు డైరెక్ట్ విమాన స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మొద‌ట రెండు ఇండిగో విమానాల‌తో సేవ‌ల‌ను ప్రారంభిస్తామ‌ని తెలిపింది.

హైద‌రాబాద్ – సింగ‌పూర్ ఇండిగో స‌ర్వీసులు అక్టోబ‌ర్ 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి. సింగపూర్ వెళ్లే 6ఈ-1027 విమానం హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 2.50 గంటలకు (IST) బయలుదేరి 10.00 గంటలకు (సింగపూర్ స్టాండర్డ్ టైమ్) సింగపూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణానికి 6ఈ-1028 విమానం సింగపూర్ నుంచి 23.25 గంటలకు (సింగపూర్ స్టాండర్డ్ టైమ్) బయలుదేరి 01.30 గంటలకు (IST) హైదరాబాద్ చేరుకుంటుంది.

హైదరాబాద్-కొలంబో మార్గంలో న‌వంబ‌ర్ 3వ తేదీన ఇండిగో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. కొలంబోకు 6ఈ-1181 విమానం హైదరాబాద్ నుంచి 11.50 గంటలకు (IST) బయలుదేరి 14.00 గంటలకు (IST) కొలంబో చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 6ఈ-1182 విమానం కొలంబో నుంచి 1500 (IST) గంటలకు బయలుదేరి 17.00 గంటలకు (IST) హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీస్ ప్రతి సోమ, మంగళ, శుక్ర, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది.

ఈ సంద‌ర్భంగా జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్ర‌దీప్ ప‌ణిక‌ర్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ నుంచి నేరుగా కొలంబో, సింగ‌పూర్‌కు ఇండిగో విమాన స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. హైద‌రాబాద్ నుంచి ప్రపంచంలోని ఇత‌ర ప్రాంతాల‌కు క‌నెక్టివిటీని పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామని తెలిపారు. ప్ర‌స్తుతం ప్రారంభించ‌బోయే కొలంబో, సింగ‌పూర్ క‌నెక్టివిటీ ప‌ర్యాట‌కం, వాణిజ్యానికి గ‌ణ‌నీయ‌మైన దోహ‌దం చేస్తుంద‌న్నారు. ప్ర‌యాణికుల‌కు సుల‌భ‌త‌ర ప్ర‌యాణం అందించేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు.