అర్ధ‌రాత్రి వేళ‌.. భారీ రైలు ప్ర‌మాదాన్ని ఆపిన వృద్ధ దంప‌తులు..

ఓ ఇద్ద‌రు వృద్ధ దంప‌తులు త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి భారీ రైలు ప్ర‌మాదాన్ని ఆపారు. దీంతో వందల మంది ప్ర‌యాణికులు ప్రాణాల‌తో బ‌తికారు.

అర్ధ‌రాత్రి వేళ‌.. భారీ రైలు ప్ర‌మాదాన్ని ఆపిన వృద్ధ దంప‌తులు..

చెన్నై : ఓ ఇద్ద‌రు వృద్ధ దంప‌తులు త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి భారీ రైలు ప్ర‌మాదాన్ని ఆపారు. దీంతో వందల మంది ప్ర‌యాణికులు ప్రాణాల‌తో బ‌తికారు. ఒక వేళ ఆ దంప‌తులిద్ద‌రూ అప్ర‌మ‌త్తంగా లేకుంటే.. వంద‌ల మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోయేవి. అర్ధ‌రాత్రి వేళ‌లోనూ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి.. భారీ రైలు ప్ర‌మాదాన్ని ఆపిన ఆ దంప‌తుల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడులోని భ‌గ‌వ‌తీపురం రైల్వే ట్రాక్‌కు స‌మీపంలో ష‌ణ్ముగం, కుర్నుత్త‌మ్మ‌ల్ అనే వృద్ధ దంప‌తులు నివసిస్తున్నారు. అయితే ఆదివారం తెల్ల‌వారుజామున ఒంటి గంట స‌మ‌యంలో వారికి భారీ శ‌బ్దం వినిపించింది. దీంతో వారిద్ద‌రూ స‌మీపంలో ఉన్న ట్రాక్ వ‌ద్ద‌కు వెళ్లి చూడ‌గా, ఘాట్ రోడ్డులో ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న లారీ రైల్వే ట్రాక్‌పై ప‌డిపోయింది.

ఇక అదే స‌మ‌యంలో ట్రాక్‌పైకి ఎక్స్‌ప్రెస్ రైలు వ‌స్తుంద‌ని గ‌మ‌నించిన వృద్ధ దంప‌తులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. త‌మ వ‌ద్ద టార్చి లైట్‌తో ప‌ట్టాల‌పై కొంచెం దూరం వ‌ర‌కు ప‌రుగులు పెట్టారు. టార్చి లైట్ స‌హాయంతో ఎరుపు రంగు వ‌స్త్రాన్ని చూపించి, ఎక్స్‌ప్రెస్ రైలును ఆపారు. దీంతో భారీ ప్ర‌మాదం త‌ప్పింది. ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన వృద్ద దంప‌తుల‌ను రైల్వే అధికారులు అభినందించారు. నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.