దశాబ్దకాలంలో దెబ్బతిన్న ఎన్నికల సంఘం ప్రతిష్ఠ.. మాజీ సీఈసీల ఆందోళన

  • Publish Date - March 11, 2024 / 10:57 AM IST

  • ప్రజా విమర్శలకు గురవుతున్న సీఈసీ
  • కరణ్‌థాపర్‌ ఇంటర్వ్యూలో మాజీ సీఈసీలు ఖురేషీ, కృష్ణమూర్తి
  • ప్రధాని, సీజేఐ, ప్రతిపక్ష నేతతో కూడిన కొలీజియం సీఈసీలను ఎంపిక చేయాలని సూచన

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠపై ఇద్దరు మాజీ సీఈసీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైర్‌ వెబ్‌సైట్‌కు చెందిన కరణ్‌థాపర్‌కు ఎస్‌వై ఖురేషీ, టీఎస్‌ కృష్ణమూర్తి వేర్వేరుగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎన్నికల సంఘం వన్‌ మ్యాన్‌ కమిషన్‌గా మారటం, కొత్త కమిషనర్ల నియామకంలో ప్రతిపక్షం అభిప్రాయాలను తిరస్కరించే శక్తిని ప్రధాని కలిగి ఉన్న నేపథ్యంలో వారు కరణ్‌థాపర్‌తో మాట్లాడారు. గత దశాబ్ద కాలంలో ఎన్నికల సంఘం ప్రతిష్ఠ ఎంతగానో విధ్వంసానికి గురైందని మాజీ ఎన్నికల కమిషనర్‌ ఎస్‌ వై ఖురేశీ చెప్పారు. ఎన్నికల కమిషన్‌ ప్రజల విమర్శలకు గురయ్యే పరిస్థితి నెలకొనడం తనకు ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తగిన దూరం పాటించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం కలవకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈసీలో సమాచార లోపం ఉన్నదని చెప్పారు.


విశ్వసనీయతను నిరూపించుకోవాలి

ఎన్నికల సంఘం తన పనితీరుద్వారా తన విశ్వసనీయతను నిరూపించుకోవాల్సి ఉన్నదని మరో మాజీ కమిషనర్‌ టీఎస్‌ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా లేదన్న అభిప్రాయాన్ని సరిదిద్దుకోవడానికి ఏ మాత్రం తటపటాయించాల్సిన అవసరం లేదని చెప్పారు. కమిషన్‌ ముగ్గురు సభ్యులతో పనిచేయాలన్న అభిప్రాయాన్ని ఇద్దరు మాజీలూ వ్యక్తం చేశారు. అయితే.. వన్‌ మ్యాన్‌ కమిషన్‌కు సంబంధించిన తనకేమీ అభ్యంతరం లేదని, అది ప్రస్తుత సీఈసీ రాజీవ్‌ కుమార్‌ అయితే.. ఆయన నిబద్ధత పట్ల తనకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయని చెప్పారు.

ప్రభుత్వ ఆధిపత్యం లేని కొలీజియం ద్వారా ఎన్నికల కమిషనర్లను నియమించడానికి తాను ప్రాధాన్యం ఇస్తామని ఇద్దరు మాజీలూ పేర్కొన్నారు. అయితే.. సుప్రీంకోర్టు నిర్ణయించిన కొలీజియంకు తాను ప్రాధాన్యం ఇస్తానని కృష్ణమూర్తి తెలిపారు. అందులో ప్రధాని, చీఫ్‌ జస్టిస్‌, ప్రతిపక్ష నేత ఉండాలని, ఆ కొలీజియం ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాలని సూచించారు. ఎన్నికల కమిషనర్‌ పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేసిన అరుణ్‌గోయల్‌ విషయంలో వార్తా పత్రికల్లో వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ.. ఉన్నట్టుండి ఒక వ్యక్తి రాజీనామా చేయడాన్ని తాను అంగీకరించబోనని అన్నారు. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం ఆరోగ్యకరమని, అటువంటివి కొనసాగాలని చెప్పారు. 

Latest News