నీట్‌ పవిత్రత దెబ్బతిన్నది.. రీ టెస్ట్‌ నిర్వహణపై ఆచితూచి నిర్ణయం: సుప్రీంకోర్టు

పరీక్ష పత్రాల లీకేజీతో నీట్‌ యూజీ పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదనడంలో సందేహం లేదని, అది ఎంతమేరకు అనేది నిర్ధారించాల్సి ఉన్నదని సుప్రీంకోర్టు సోమవారం (జూలై 8, 2024) పేర్కొన్నది.

నీట్‌ పవిత్రత దెబ్బతిన్నది.. రీ టెస్ట్‌ నిర్వహణపై ఆచితూచి నిర్ణయం: సుప్రీంకోర్టు

ఇది 23 లక్షల మంది విద్యార్థుల అంశం
వివరాల సమర్పణకు ఎన్టీయేకు ఆదేశం

న్యూఢిల్లీ : పరీక్ష పత్రాల లీకేజీతో నీట్‌ యూజీ పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదనడంలో సందేహం లేదని, అది ఎంతమేరకు అనేది నిర్ధారించాల్సి ఉన్నదని సుప్రీంకోర్టు సోమవారం (జూలై 8, 2024) పేర్కొన్నది. నీట్‌ పరీక్ష పేపర్ల లీకేజీపై పలువురు విద్యార్థులు, కోచింగ్‌ సెంటర్లు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ధర్మాసనం.. మళ్లీ పరీక్ష నిర్వహించే విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి పేపర్‌ లీక్‌ స్వభావాన్ని గుర్తించడం ముఖ్యమని పేర్కొన్నది. మళ్లీ పరీక్షకు ఆదేశించే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఎందుకంటే ఇది 23 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది. మళ్లీ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రయాణాలు, ప్రస్తుత అకడమిక్‌ షెడ్యూల్‌ మార్పు వంటివి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

పేపర్‌ లీకేజీ స్వభావం ఏంటి? ఎలా లీక్‌ అయింది? లీకేజీని ఎలా నివారించాల్సింది? లీకేజీతో లాభపడిన విద్యార్థులను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ చర్యలు అనే అంశాలను పరిశీలించాలని చీఫ్‌ జస్టిస్‌ అన్నారు. లీకైన పరీక్ష పత్రం వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి యాప్స్‌ ద్వారా వెళ్లి ఉంటే.. దావానలంలా వ్యాపించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఈ కేసులో తదుపరి విచారణను జూలై 11వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. పేపర్‌ లీకేజీ మొదట ఎప్పుడు జరిగిందని, ఎలా సమాచారం వెళ్లిందని గుర్తించారో చెప్పాలని ఎన్టీయేను కోర్టు కోరింది. పరీక్ష తేదీకి, ప్రశ్న పత్రం లీకేజీకి మధ్య ఎన్ని రోజుల వ్యవధి ఉన్నదో చెప్పాలని సూచించింది. దీన్నుంచి ఎవరు లబ్ధి పొందినట్టు గుర్తించారో కూడా తెలిపాలని కోరింది. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న సీబీఐని కూడా స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. వీటిని జూలై 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా ఇవ్వాలని కోరింది.