ఏ చెట్టుకు ఉరి పెట్టుకోవాలి స‌ర్..! విల‌పించిన గ్రూప్-1 అభ్యర్థిని

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్​ 1 ఉద్యోగ ప్రిలిమ్స్​(TGPSC Group 1 prelims) పరీక్షల ఫలితాలు ప్రకటించింది. ముందుగా అనుకున్నట్లుగానే, సాధారణ పరిపాలనా శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల జిఓ నెం.55(GO No. 55)  ప్రకారం, 1:50 (1:50 Ratio)నిష్పత్తిలోనే అభ్యర్థులను మెయిన్స్​కు ఎంపిక చేసారు. కాగా, 1:100 నిష్పత్తితో ఎంపిక చేయాలని నిరుద్యోగులు చేసిన అభ్యర్థనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో మెయిన్స్ అర్హతకు దూరమైన అభ్యర్థులు గోడుగోడున విలవిస్తున్నారు.

ఏ చెట్టుకు ఉరి పెట్టుకోవాలి స‌ర్..! విల‌పించిన గ్రూప్-1 అభ్యర్థిని

 హైద‌రాబాద్ :   గ్రూప్​ 1 ప్రలిమ్స్​ ఫలితాలను టిజిపిఎస్​సీ విడుదల చేసింది. జిఓ నెం.55 మార్గదర్శకాల ప్రకారం 1:50 నిష్పత్తిలోనే మెయిన్స్​కు అభ్యర్థులను ఎంపిక చేసింది. మొత్తం 563 :   గ్రూప్​ 1 పోస్టులకు గానూ, 4,03,000 మంది అభ్యర్థులు జూన్ 9, 2024న  ప్రిలిమ్స్​ రాయగా, 74 శాతం (3,01,000) మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 31,382 మందిని మెయిన్స్​ పరీక్షకు టిజిపిఎస్​సి ఎంపిక చేసింది(31,382 qualified for Mains).  వీరంతా, అక్టోబర్​ 21 నుండి 27 వరకు జరిగే మెయిన్స్​ రాత పరీక్షకు అర్హత సాధించారు.  గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిల‌వాల‌ని నిరుద్యోగులు నెత్తీనోరు కొట్టుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టి,  చివ‌ర‌కు 1:50 ప‌ద్ధతిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది టీజీపీఎస్సీ. దీంతో చాలా ఏళ్లుగా పరీక్షకు కష్టపడుతున్న అభ్యర్థుల్లో చాలా మంది గ్రూప్-1 మెయిన్స్‌కు దూర‌మ‌య్యారు. నిరుద్యోగుల స‌హ‌కారంతోనే అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వారి క‌న్నీటికి కార‌ణ‌మైందని ఏడుస్తున్నారు. ఓ గ్రూప్​ 1 అభ్యర్థిని దు:ఖం సోషల్​ మీడియాలో చాలామందిని కదిలిస్తూంది. మా చావును చూసుకునేందుకే మేం ప్రభుత్వాన్ని మార్చామా..? అని ఆ అమ్మాయి ప్రశ్నిస్తూ, ఇప్పుడు మేం ఏ చెట్టుకు ఉరేసుకోవాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగట్టడం ఆ ఆడియో క్లిప్​లో ఆవేదన కలిగిస్తోంది. A disqualified candidate’s distress on Social Media.

ఓ గ్రూప్-1 అభ్యర్థిని ఆవేద‌న ఇదీ.. ఆమె మాట‌ల్లోనే..

ఎందుకు సార్ ఇదంతా.. మూడు సంవ‌త్సరాల నుంచి ఇంటికి కూడా వెళ్లడం లేదు. లాస్ట్ ఇయ‌రంతా క్వాలిఫై అయ్యాం క‌దా..? ఈ ఒక్కసారి మాకు ఈ ఖ‌ర్మ ఎందుకు వ‌చ్చిందో అర్థం కావ‌డం లేదు. ఉన్న రిజ‌ర్వేష‌న్లు అన్ని తీసేశారు. తీసేస్తే తీసేశారు.. 1:100 అయినా పిల‌వొచ్చు క‌దా..? మెయిన్స్ రాసుకుంటాం క‌దా..? కోచింగ్‌లు కూడా అయిపోయాయి. ఇప్పుడు మేం ఏం చేయాలి.. ఏ చెట్టుకు ఉరి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్లాలి. అస‌లు మాకు బ‌తుకే లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తే గ‌వ‌ర్నమెంట్‌కు ఏం వ‌చ్చింది స‌ర్ అస‌లు. మెయిన్స్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని అడుగుతున్నాం. ఆ త‌ర్వాత మేం ఏం అడ‌గ‌మ‌ని కూడా ప్రామీస్ చేస్తున్నాం. ఏపీలో అవ‌కాశం ఇచ్చారు క‌దా..? వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2008లో ఎగ్జామ్ రాసిన నెల రోజులకు 1:100 అవ‌కాశం ఇచ్చాడు క‌దా..? తెలంగాణ జ‌నాల‌కే ఈ దౌర్భాగ్యమా..? క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్‌కు మ‌ళ్లీ ఎగ్జామ్ పెట్టకుండా రీ నోటిఫికేష‌న్ వేశారు.. ఈ విష‌యంలో మేం ఏమైనా అన్నామా..? రిజర్వేష‌న్లు అన్ని ఎత్తేసి ప్రిలిమ్స్ పెట్టారు.. మేం ఏమైనా అన్నామా..? మాకు 1:100 పిలిచి ఒక్క ఛాన్స్ ఇవ్వమ‌ని అంటున్నాం. మేం గొప్పోళ్లం కాక‌పోవ‌చ్చు.. చ‌దువుకున్నాం కాబ‌ట్టి అవ‌కాశం ఇవ్వమ‌ని అడుగుతున్నాం అది త‌ప్పా..? నేను ఇప్పుడు చ‌స్తా.. రాహుల్ గాంధీ ఇంటికి తీసుకెళ్లమ‌ని చెప్పండి.. నాకు ఇంక బ‌త‌కడానికి ఆప్షనే లేదు స‌ర్. నాకు వేరే ఆపర్చునిటీ లేనే లేదు స‌ర్. ఈ ఒక్క ఎగ్జామ్ కోసం ఎదురుచూస్తున్నం స‌ర్.. 12 ఏండ్ల త‌ర్వాత ఒక్క నోటిఫికేష‌న్ ఇచ్చారు. నిబంధ‌న‌లు ఏం మార్చం అని అన్నారు. మేం స‌చ్చిపోతే ఈ గ‌వ‌ర్నమెంట్‌కు ఏం వ‌స్తది స‌ర్. మా చావు కోసమేనా ఇదంతా..? మా చావును చూసుకునేందుకేనా ఇన్ని రోజులు చ‌దువుకున్నది?. మా చావును చూసుకునేందుకు ఒక ప్రభుత్వాన్ని మార్చిన‌మా.. అనిపిస్తుంది స‌ర్. మా వ‌ల్ల కాదు స‌ర్ మీకు దండం పెడుతా.. మ‌మ్మల్ని ఢిల్లీకి తీసుకుపోండి స‌ర్.. అక్కడ చ‌చ్చిపోతాం. రాహుల్ గాంధీ అప్పుడు చిక్కడ‌ప‌ల్లి లైబ్రరీకి రాలేదా..? మా బాధ‌లు తీర్చుతామ‌ని చెప్పలేదా..? భ‌ట్టి విక్రమార్క ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు 1:100 పిల‌వాల‌ని అన‌లేదా..? నిన్నగాక మొన్న ఏపీ గ్రూప్-2లో ఇవ్వలేదా స‌ర్. జీవో 29 స‌వ‌రిస్తే స‌రిపోతది అని చెబుతుంటే కొంద‌రు రాజ‌కీయాలు చేస్తున్నరు. ఎవ‌ర్ని చావ‌గొట్టడానికి ఈ రాజకీయాలు చేస్తున్నరు?. అవ‌కాశాలు పెంచ‌డానికి ప్రభుత్వం ఆలోచిస్తది.. చ‌నిపోయేటోన్ని బ‌తికించ‌డానికి ప్రభుత్వం ఆలోచిస్తది. ఈ ప్రభుత్వం అట్ల కాదు.. బ‌తికేతోన్ని కూడా చంపి పెడుత‌రు. ఎందుకు బ‌త‌కాలి.. బ‌త‌క‌డానికి ఇంకోక ఆప్షన్ కూడా లేదు స‌ర్. మాకు మ‌రో దారి లేదు స‌ర్.. ప్లీజ్ ఆ రూల్స్ మార్చండి స‌ర్ ..

ఇదీ మెయిన్స్​కు అర్హత సాధించలేకపోయిన ఆ అమ్మాయి అవేదన. కాకపోతే నిబంధనలను మార్చడం కుదరదని టిజిపిఎస్​సి తేల్చిచెప్పింది. కోర్టు తీర్పుల ప్రకారం 1:50 కి ప్రభుత్వం కట్టుబడిఉండాల్సిందేనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ 1:100 కి మారిస్తే, అది నిబంధనలకు(Against the Rules) అతిక్రిమించినట్లుగా అవుతుందని, కోర్ట్లు మళ్లీ దీనికి అభ్యంతరం చెపితే, పరీక్ష మళ్లీ నిర్వహించాల్సివస్తుందని అది చాలా సమయాన్ని వృథా చేస్తుందని అంటున్నారు. సుప్రీంకోర్టు(Supreme Court) కూడా నిష్పత్తి పెంచితే అర్హులకు అన్యాయం చేసినట్లేనని తీర్పిచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి గుర్తు చేసినట్లు చెబుతున్నారు.