గ్రూప్ అభ్యర్థుల డిమాండ్లను పరిష్కరించాలి.. సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ

గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు

గ్రూప్ అభ్యర్థుల డిమాండ్లను పరిష్కరించాలి.. సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ

మీరిచ్చిన హామీలను అమలు చేయాలి

విధాత : గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనను, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుకని క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశామని, కాని వారి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా క్యాబినెట్ సమావేశం ముగించారని హరీశ్‌రావు విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మీరు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామని మాట ఇచ్చారన్నారు.

పదేళ్ల బీఆరెస్‌ పాలనలో వివిధ శాఖల్లో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి మీకు ఓటేశారని లేఖలో పేర్కోన్నారు. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు దాటిందని, బీఆరెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలను ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. గ్రూప్ 1, డిఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులు చేస్తున్న విజ్ఞప్తిని వినే పరిస్థితిలో కూడా మీ ప్రభుత్వం లేకపోవడం శోచనీయమని హరీశ్‌రావు లేఖలో విమర్శించారు. అందుకే బాధ్యతగల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వారి సమస్యలను మీ దృష్టికి తెచ్చి పరిష్కరించాలని కోరుతున్నానని తెలిపారు.

మీ హామీలనే అమలు చేయమంటున్నాం

ప్రధానంగా గ్రూప్ 1మెయిన్స్‌కు గతంలో వైఎస్సార్ ప్రభుత్వం మాదిరిగా, మీ డిప్యూటీ సీఎం గతంలో కోరినట్లుగా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని సీఎం రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గతంలో మీరు చేసిన డిమాండ్‌ను అమలు చేయగలిగే అవకాశం మీకిప్పుడు ఉంది కానీ ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అలాగే గ్రూప్‌ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని మీరు ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నారు.

నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి పెంచేలా పరీక్ష షెడ్యూల్ సవరించాలని కోరారు. జూలై చివరి వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష ఉందని, ఏడు రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని అంటున్నారని, ఈ ఒత్తిడితోనే సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకుందని గుర్తు చేశారు. మీరు చేసిన ఎన్నికల వాగ్ధానం అమలు కోసం వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి తదనుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

మీ మ్యానిఫెస్టోలో 25 వేల టీచర్ పోస్టులలో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించారని, కానీ ఆచరణలో అందుకు భిన్నంగా 11 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారని, మీ హామీకి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా మెగా డీఎస్సీ నిర్వహించాలని హరీశ్‌రావు లేఖలో డిమాండ్ చేశారు. అదే విధంగా మీరు ఇచ్చిన హామీల మేరకు 4వేల నిరుద్యోగ భృతి, జీవో నెంబర్ 46 రద్దు హామీలనలు అమలు చేసి నిరుద్యోగులకు, ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.