సమస్యల తీవ్రతకు అద్దం పట్టిన కోమటిరెడ్డి ప్రజాదర్బార్‌.. బారులు తీరిన ప్రజలు

బీఆరెస్ ప్రభుత్వ పాలన నచ్చక కాంగ్రెస్ పాలన తెచ్చుకున్న ప్రజలు కాంగ్రెస్ ప్రజాపాలనపై..ఇందిరమ్మ ప్రభుత్వంలో తమ సమస్యల పరిష్కారంపై భారీ ఆశలే పెట్టుకున్నారు

  • By: Somu |    telangana |    Published on : Jul 08, 2024 6:52 PM IST
సమస్యల తీవ్రతకు అద్దం పట్టిన కోమటిరెడ్డి ప్రజాదర్బార్‌.. బారులు తీరిన ప్రజలు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ప్రభుత్వ పాలన నచ్చక కాంగ్రెస్ పాలన తెచ్చుకున్న ప్రజలు కాంగ్రెస్ ప్రజాపాలనపై..ఇందిరమ్మ ప్రభుత్వంలో తమ సమస్యల పరిష్కారంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఏడు నెలలు గడుస్తున్నా తాము ఆశించిన సమస్యల పరిష్కారం జరుగడం లేదన్న అసంతప్తి పలు వర్గాల నుంచి వినిపిస్తున్నప్పటికి ఇప్పటికైతే వారి అసంతృప్తి బహిరంగ ఆందోళనల రూపం దాల్చేలేదు. ప్రస్తుతానికి వినతుల రూపంలోనే ప్రజల ఆకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు రాజధాని హైదరాబాద్‌లో ప్రజాభవన్‌లో నిర్వహించే ప్రజావాణి…జిల్లాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన నియోజవర్గం ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం నల్లగొండలో సోమవారం చేపట్టిన ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి పట్టణంతో పాటు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యల పరిష్కారం ఆశిస్తూ బారులు తీరిన ప్రజలు ఓపిగ్గా నిరీక్షించి మంత్రికి తమ సమస్యలపై వినతులు అందించారు. వారి వినతులను స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే అందరి సమస్యలపై అధికారులతో మాట్లాడటం మాత్రం కుదరలేదు. పీఏలకు, కింది స్థాయి నాయకులకు కొంత ఆ బాధ్యతను మంత్రి అప్పగించారు.

చాల మంది ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్‌లు, భూసమస్యలు, కుటుంబ వివాదాలు వంటి సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రిని కలిశారు. మొత్తం మీద మంత్రి వెంకట్‌రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్‌కు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను చూస్తే క్షేత్ర స్థాయిలో పేరుకుపోతున్న ప్రజా సమస్యల తీవ్రతకు నిదర్శనంగా కనిపించిందంటున్నారు విశ్లేషకులు. హైదరాబాద్‌లో ఎక్కువగా నివాసం ఉంటూ..మంత్రి పదవిలో బిజీగా ఉండే మంత్రి వెంకట్‌రెడ్డి తమకు అందుబాటులో ఉన్నప్పుడే తమ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలన్న ఆలోచనతో జనం రావడం కూడా ఈ ప్రజాదర్బార్‌లో రద్ధీకి కారణమైందంటున్నారు.