• Telugu News
  • /Telangana

Komati Reddy : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరగని రికార్డు..రూ. 60,799 వేల కోట్లతో రహదారుల నిర్మాణం

రూ.60,799 కోట్లతో తెలంగాణలో రహదారుల నిర్మాణం – రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ప్రాజెక్ట్‌గా మంత్రి కోమటిరెడ్డి వెల్లడి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Nov 08, 2025, 2:30 pm IST
Read Time: 5 mins
Komati Reddy : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరగని రికార్డు..రూ. 60,799 వేల కోట్లతో రహదారుల నిర్మాణం

హైదరాబాద్, నవంబర్ 08 (విధాత): రూ. 60,799 వేల కోట్లతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని, ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరగని రికార్డు అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళ జాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారబోతోంది. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి, లక్షలాదిమంది గ్రామీణ యువతకు ఉపాధి కలగనుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

10,400 కోట్లతో హైదరాబాద్- విజయవాడ హైవేను ఎనిమిది లైన్లుగా విస్తరణ చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గతిని మార్చే RRR రహదారి నిర్మాణానికి 36,000 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం. సింగిల్ రోడ్డు ఉన్నచోట డబుల్ రోడ్ల నిర్మాణం.HAM ప్రాజెక్టుకు 11,399 కోట్లు.. కొద్ది రోజుల్లో వీటికి టెండర్లు పిలుస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

వీటితోపాటు ప్రపంచంలోని పెట్టుబడిదారులు అంతా తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రహదారుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రానున్నాయి. ఫలితంగా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాదిమంది రాష్ట్ర యువతకు ఉపాధి లభించనుందన్నారు.

8,000 వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతున్నట్లే పేర్కొన్నారు. దేశానికే తలమానికంగా మారనున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే. 20 వేల కోట్లతో నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణంతో రాష్ట్ర ముఖచిత్రమే మారుతుందన్నారు.
న భూతో న భవిష్యత్తు అన్న రీతిలో రహదారుల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. నా రాజకీయ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.