• Telugu News
  • /Telangana

Khammam Road Widening | 594 కోట్లతో ఖమ్మం జిల్లాలో భారీగా రోడ్ల విస్తరణ.. ఈ రోడ్లకు మహర్దశే…

ఖమ్మం జిల్లాలో పలు రహదారుల దశ తిరగనున్నది. జిల్లాలో సుమారు 100 కిలోమీటర్ల భాగాలను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 594 కోట్లు కేటాయించింది. ఈ పనులు పూర్తయితే.. ప్రయాణ వేగం పెరగడంతోపాటు.. భద్రత కూడా పెరుగనుంది.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Mar 21, 2026, 6:20 pm IST
Read Time: 6 mins
Khammam Road Widening | 594 కోట్లతో ఖమ్మం జిల్లాలో భారీగా రోడ్ల విస్తరణ.. ఈ రోడ్లకు మహర్దశే…

హైలైట్స్:

  • ఏఐ టెక్నాలజీతో హైవేలపై నిఘా…
  • ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఆటోమేటిక్ చలాన్లు

Khammam Road Widening |  ఖమ్మం జిల్లాలోని రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 594 కోట్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మొత్తంతో 1000.82 కిలోమీటర్ల మేర ఐదు ప్రధాన రహదారులను విస్తరించనున్నారు. ఈ పనులను హైవే నిర్మాణంలో విస్తతంగా వినియోగిస్తున్న హైబ్రిడ్‌ ఆన్యుటీ మోడల్‌ (HAM) ద్వారా చేపట్టనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

ఏ రోడ్లు విస్తరించనున్నారు?

ప్రధానంగా హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిలోని వైరా–జగ్గయ్యపేట మధ్య రహదారిని విస్తరించేందుకు 151.2 కోట్ల రూపాయలు కేటాయించారు. అదనంగా  మధిర పరిధిలో 13.5 కి.మీ. స్ట్రెచ్‌ను రూ.81 కోట్లతో నాలుగు లేన్లకు విస్తరించనున్నారు. మధిర నుంచి ఎర్రుపాలె వరకూ 18.4 కి.మీ భాగాన్ని రూ.110.4 కోట్లతో, బోనకల్ వరకు 28.03 కి.మీ. భాగాన్ని రూ157.23 కోట్లతో నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. బోనకల్ నుంచి వంగవీడు వరకు 15.72 కి.మీ స్ట్రెచ్‌ను రూ.94.32 కోట్లతో విస్తరించనున్నారు.

హైవేల్లో ఏఐ టెక్నాలజీ

రోడ్ల విస్తరణతో పాటు ఆధునిక సాంకేతికతను కూడా ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వ్యవస్థలను అమలు చేయనున్నారు. ఇది ఇప్పటికే ఖమ్మం దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టి అమలు చేశారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు ఇతర హైవేలకూ ఈ విధానాన్ని విస్తరించనున్నారు.

232 కి.మీ హైవేపై స్మార్ట్ నిఘా

హైదరాబాద్–విజయవాడ రహదారిని నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ 232 కి.మీ. పొడవునా ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థను అమలు చేయనున్నారు. ఈ వ్యవస్థలో… హైవే అంతటా సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వాటిని కమాండ్ & కంట్రోల్ సెంటర్‌కు కనెక్ట్‌ చేస్తారు. తద్వారా ట్రాఫిక్‌ను రియల్‌టైమ్‌లో మానిటర్‌ చేసే వీలు కలుగుతుంది. వాహన నంబర్‌ ప్లేట్లను సైతం ఆటోమేటిక్‌గా గుర్తించే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ ఉల్లంఘన జరిగితే మానవ జోక్యం లేకుండా నేరుగా చలాన్లు జారీ చేస్తారు. ఈ చర్యలతో ఓవర్ స్పీడ్ వెహికల్స్‌ను వెంటనే గుర్తించే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. పైగా.. ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని, ట్రాఫిక్‌ క్రమశిక్షణ పెరిగి, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని అంటున్నారు. మొత్తం మీద ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది

గ్రామీణ రోడ్లకూ ఊపిరి

ఇదిలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణం వేగం పుంజుకుంటోంది. గ్రామ పంచాయతీల నిధులతో గ్రామాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతోంది. ఖమ్మం జిల్లాలో రోడ్ల విస్తరణ మాత్రమే కాదు…స్మార్ట్ హైవేలు, ఏఐ నిఘా, భద్రత అన్నీ కలిపిన సమగ్ర అభివృద్ధి ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే ప్రయాణం వేగవంతంకావడం, ప్రమాదాలు తగ్గటం, ఆధునిక మౌలిక వసతులు పెరగడం అనే మూడు ప్రధాన ప్రయోజనాలు సాధ్యమవుతాయని అధికారులు వివరిస్తున్నారు.