రాజకీయాల నుంచి రిటైర్ కావాలనిపిస్తోంది.. వసుంధర రాజే కీలక వ్యాఖ్యలు

జైపూర్ : రాజకీయాల నుంచి రిటైర్ కావాలనిపిస్తోందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కీలక వ్యాఖ్యలు చేశారు. జలవర్‌లో తన కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్‌తో కలిసి ఓ బహిరంగ సభలో వసుంధర రాజే పాల్గొన్నారు. తన కుమారుడికి ఉన్న మద్దతు, అతని మాటలు విన్న తర్వాత తాను రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని ఉందన్నారు. ఇక దుష్యంత్‌కు తన అవసరం లేదని, మీరంతా బాగా శిక్షణ ఇచ్చారని వసుంధర ఎమోషన్ అయ్యారు.
జలవర్ అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేస్తున్నారు. మూడు దశాబ్దాల నుంచి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. రోడ్లు బాగు చేసుకున్నాం. మంచి నీరు అందించే ప్రాజెక్టులను పూర్తి చేశారు. రైల్వే, విమాన కనెక్టివిటీని కూడా సాధించామన్నారు. జలవర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆమె తెలిపారు. బీజేపీ గెలిచినప్పుడే రాజస్థాన్ మళ్లీ నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నపత్రాలు లీక్, నిరుద్యోగం వంటి సమస్యలు అధికమయ్యాయని పేర్కొన్నారు.
నవంబర్ 25న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో జలవర్ నియోజకవర్గం నుంచి వసుంధరరాజే బరిలో ఉన్నారు. దీంతో ఆమె ఇవాళ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
నవంబర్ 25 అసెంబ్లీ ఎన్నికల కోసం రాజే శనివారం ఝలావర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.