Bihar Assembly Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. తొలి దశలో పోటీ పడుతున్న 10 మంది ప్రముఖులు వీరే
Bihar Assembly Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో( Bihar Elections ) భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. 18 జిల్లాల పరిధిలో 121 నియోజకవర్గాల్లో 1,314 మంది బరిలో దిగారు. వీరిలో 10 మంది ప్రముఖ లీడర్లు ఉన్నారు.
Bihar Assembly Elections | పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో( Bihar Elections ) భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. 18 జిల్లాల పరిధిలో 121 నియోజకవర్గాల్లో 1,314 మంది బరిలో దిగారు. వీరిలో 10 మంది ప్రముఖ లీడర్లు ఉన్నారు. ఈ ప్రముఖుల్లో ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌తో పాటు ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్(జనశక్తి జనతా దళ్), డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్, భోజ్‌పూరి సూపర్ స్టార్ కేసరి లాల్ యాదవ్, జ్యోతి సింగ్(భోజ్‌పూరి నటుడు పవన్ సింగ్ భార్య), ట్రాన్స్‌జెండర్ ప్రీతి కిన్నార్(జన్ సురాజ్ పార్టీ) బరిలో ఉన్నారు.
తేజస్వీ యాదవ్(ఆర్జేడీ) – రఘోపూర్

ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ రఘోపూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా. తేజస్వీపై బీజేపీ నాయకుడు సతీశ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గం ఆర్జేడీకి కంచుకోటగా ఉంది. 1995 నుంచి ఆర్జేడీ పాగా వేయగా, కేవలం 2010 నుంచి 2015 మధ్యలోనే ఈ నియోజకవర్గంలో ఓడిపోయింది. తేజస్వీ యాదవ్ 2025 వరకు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. జన్‌సురాజ్ పార్టీ నుంచి చంచల్ కుమార్ బరిలో ఉన్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ (జేజేడీ) – మహువా

లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడే తేజ్ ప్రతాప్ యాదవ్. వివాహేతర సంబంధాల కారణంగా తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరించిన తర్వాత ఆయన జనశక్తి జనతా దళ్ అనే కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల రంగంలోకి దిగారు. మహువా నియోజకవర్గం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో ఉన్నారు. ఆర్జేడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముకేశ్ కుమార్ రౌషన్ మీద తేజ్ ప్రతాప్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ నుంచి సంజయ్ సింగ్ పరీక్ష ఎదుర్కొంటున్నారు.
మైథిలీ ఠాకూర్(బీజేపీ) – అలీనగర్

మైథిలీ ఠాకూర్ ఫోక్ సింగర్‌గా ఫేమస్. దర్బంగా జిల్లాలోని అలీ నగర్ నుంచి మైథిలీని బీజేపీ పోటీకి దింపింది. అలీనగర్ నియోజకవర్గం చాలా కాలంగా లాలు ప్రసాద్ యాదవ్ ఆధీనంలో ఉంది. అయితే 2020 ఎన్నికల్లో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ నుంచి గెలుపొందిన మిశ్రీ లాల్ యాదవ్.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో మైథిలీ గెలుస్తుందనే విశ్వాసంతో బీజేపీ నాయకత్వం ఉంది. ఇక ఆర్జేడీ నుంచి బినోద్ మిశ్రా, జన్ సురాజ్ నుంచి బిప్లవ్ కుమార్ చౌదరి బరిలో ఉన్నారు.
సామ్రాట్ చౌదరి(బీజేపీ) – తారాపూర్

ప్రస్తుతం సామ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి కూడా. సామ్రాట్ చౌదరి 15 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ముంగేర్ జిల్లాలోని తారాపూర్ నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వెనుకబడిన కులాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ షా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు.
విజయ్ కుమార్ సిన్హా(బీజేపీ) – లఖీసారాయి

విజయ్ కుమార్ సిన్హా కూడా డిప్యూటీ సీఎం. ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సిన్హా.. ఆరోసారి తన భవిష్యత్‌ను పరీక్షించుకుంటున్నారు. ఈయన మీద జన్ సురాజ్ పార్టీ నుంచి సూరజ్ కుమార్ పోటీ చేస్తున్నారు. లఖీసారాయి నియోజకవర్గం గత 15 ఏండ్ల నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంది. 2010 నుంచి సిన్హా సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
భోజ్‌పూరి నటుడు కేసరి లాల్ యాదవ్(ఆర్జేడీ) – ఛప్రా

భోజ్‌పూరి సూపర్ స్టార్ కేసరి లాల్ యాదవ్ ఛప్రా నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. కేసరి లాల్ యాదవ్ ప్రజాదరణ పొందిన ప్రసిద్ధ గాయకులు కూడా. ఈ నియోజకవర్గంలో బీజేపీ తరపున చోటీ కుమారి పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి రాఖీ గుప్తా బరిలో ఉన్నారు. కేసరి లాల్ 70కి పైగా చిత్రాల్లో నటించడంతో పాఆటు 5 వేలకు పైగా పాటలు పాడారు. ఇక బీజేపీని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఒకరు దేవాలయాలను నిర్మించొచ్చు కానీ.. అవి మన పిల్లల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయా..? అని ప్రశ్నించారు. ఒక వేళ దేవాలయాలు మన పిల్లల భవిష్యత్‌ను నిర్ణయిస్తే.. బీహార్‌లో 200 దేవాలయాలను నిర్మించాలని తాను కోరుకుంటున్నానని కేసరి లాల్ యాదవ్ బీహార్ ఓటర్లను కోరారు.
జ్యోతి సింగ్(స్వతంత్ర అభ్యర్థి) – కరాకత్

భోజ్‌పూరి నటుడు పవన్ సింగ్ భార్యనే జ్యోతి సింగ్. భర్తతో విబేధాలతో వార్తల్లో నిలిచిన ఆమె కరాకత్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, బీజేపీకి నిజమైన సైనికుడిగా కొనసాగుతానని పవన్ సింగ్ ప్రకటించిన తర్వాత జ్యోతి సింగ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సీపీఐ-ఎంఎల్ నేత అరుణ్ కుమార్ సింగ్ కరాకత్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జనతా దళ్ యునైటెడ్ నుంచి మహబలి సింగ్ బరిలో ఉన్నారు.
ప్రీతి కిన్నార్(జన్ సూరజ్) – భోరే

ప్రీతి కిన్నార్ ట్రాన్స్‌జెండర్. గోపాల్‌గంజ్‌లోని భోరే నియోజకవర్గం నుంచి జన్ సూరజ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈమె ఎడ్యుకేషన్ మినిస్టర్ సునీల్ కుమార్‌పై పోటీకి దిగారు. జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ధనంజయ్ సీపీఐ-ఎంఎల్ నుంచి పోటీలో ఉన్నారు. కళ్యాన్‌పూర్ గ్రామానికి చెందిన ప్రీతి కిన్నార్ సామాజిక సేవలో ముందున్నారు. స్థానిక సమస్యలపై ఆమెకు సంపూర్ణ అవగాహన ఉంది.
అనంత్ సింగ్ (జేడీయూ) – మోకమా

అనంత్ సింగ్ మోకమా నియోజకవర్గం నుంచి జేడీయూ తరపున పోటీ చేస్తున్నారు. జన్ సూరజ్ పార్టీ మద్దతుదారు దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్‌ను అరెస్టు చేశారు. మరోవైపు ఆర్జేడీ టికెట్‌పై సూరజ్ భన్ సింగ్ భార్య వీణా దేవీ పోటీ చేస్తున్నారు. ఐదుసార్లు మోకమా నుంచి గెలుపొఒందిన అనంత్ సింగ్‌పై 28 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2022లో ఆయుధ కేసులో దోషిగా తేలి అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయినప్పుడు, ఆయన భార్య నీలం దేవి ఉప ఎన్నికలో పోటీ చేసి మోకామాను నిలబెట్టుకున్నారు.
నితీన్ నబీన్(బీజేపీ) – బంకీపూర్

నితీన్ నబీన్ రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఐదోసారి గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి బరిలో ఉన్న రేఖా గుప్తా నితీన్‌కు గట్టి పోటీనిస్తున్నారు. 2010 నుంచి బీజేపీకి బంకీపూర్ కంచుకోటగా ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram