వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బోణీ కొట్టిన భార‌త్..జైషా అభినంద‌న‌లు

  • By: sn    breaking    Jan 21, 2024 12:52 AM IST
వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బోణీ కొట్టిన భార‌త్..జైషా అభినంద‌న‌లు

గ‌త ఏడాది భార‌త్ గ‌డ్డ‌పై మెయిన్ ఆట‌గాళ్ల వ‌రల్డ్ క‌ప్ స‌మ‌రం జ‌ర‌గ‌డం చూశాం. ఇందులో ఆస్ట్రేలియా క‌ప్ గెలుచుకుంది. ఇక ఇప్పుడు అండర్ 19 ప్రపంచ కప్ ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతుంది. ఈ టోర్నీలో భార‌త్ త‌న తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడింది. దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఉదయ్ సహారన్ నేతృత్వంలోని టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టును 84 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో తొలి విజ‌యం న‌మోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 251 ప‌రుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 76 పరుగులు, కెప్టెన్ ఉదయ్ సహారన్ 64 చేయ‌డంతో భార‌త్ మంచి స్కోరే చేసింది.

ఇక 252 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ క‌నీసం 50 ఓవ‌ర్స్ కూడా ఆడ‌లేకపోయింది. 45.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేయగలిగింది. టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ ఆదర్శ్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త్‌కి కూడా పెద్ద‌గా శుభారంభం ల‌భించ‌లేదు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి 7 పరుగులకే పెవీలియ‌న్ బాట ప‌ట్ట‌గా, మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న ముషీర్ ఖాన్ కూడా 3 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు. ఆ స‌మ‌యంలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్‌తో కలిసి కెప్టెన్ ఉదయ్ సహారన్ జట్టు ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. ఇండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దీంతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లారు. లోయర్‌ ఆర్డర్‌లో ప్రియాంషు మోలియా, ఆరావళి అవనీష్‌రావు తలో 23 పరుగులు చేశారు. సచిన్ దాస్ 26 పరుగులు చేయ‌డంతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేసింది భార‌త్.

ఇక బంగ్లాదేశ్ తరపున బౌలింగ్‌లో రాణించిన మారుఫ్ అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ విష‌యానికి వ‌స్తే బంగ్లాదేశ్ జట్టులో అరిఫుల్ ఇస్లాం 41 పరుగులతో ఇన్నింగ్స్ ఆడగా, మహ్మద్ షిహాబ్ జేమ్స్ 54 పరుగులతో పోరాడిన కూడా త‌మ జ‌ట్టుని గెలిపించ‌లేక‌పోయారు. భార‌త బౌల‌ర్స్ సౌమ్య పాండే 9.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతడికి తోడు ముషీర్ ఖాన్ 10 ఓవర్లలో 35 పరుగులిచ్చి రెండు ముఖ్యమైన వికెట్లు తీశాడు. ఇక భార‌త్ ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉంది. ఇక టీమిండియా మంచి విజ‌యం సాధించ‌డంతో జైషా టీమ్‌ని అభినందిస్తూ ట్వీట్ చేశారు..