ఐదో టెస్ట్‌లో ఇన్నింగ్స్ తేడాతో రికార్డ్ విజ‌యం సాధించిన టీమిండియా.. రోహిత్ గాయంపై ఆందోళ‌న‌

ఐదో టెస్ట్‌లో ఇన్నింగ్స్ తేడాతో రికార్డ్ విజ‌యం సాధించిన టీమిండియా.. రోహిత్ గాయంపై ఆందోళ‌న‌

ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌లో ఓడిన భార‌త్ ఆ త‌ర్వాత వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసింది. తాజాగా జ‌రిగిన ఐదో టెస్ట్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. రూట్ ఇండియా విజ‌యాన్ని కాస్త ఆల‌స్యం చేసిన‌ప్ప‌టికీ భార‌త్ చివ‌రికి మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది. భారత్ ఓవర్‌నైట్ స్కోరు 473/8 తో మూడో రోజు ఆట‌ను కొన‌సాగించ‌గా, ఆట ప్రారంభమైన 20 నిమిషాల్లోనే ఆలౌట్ అయింది. మూడో రోజు కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి 477 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అయితే కుల్దీప్ యాద‌వ్ వికెట్ తీసిన అండ‌ర్స‌న్ మొత్తంగా ఏడు వంద‌ల వికెట్ల‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. మ‌రోవైపు బషీర్ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు ద‌క్కించుకున్నాడు.

ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కి భార‌త్ చుక్క‌లు చూపించింది. రోహిత్ శ‌ర్మ వెన్ను నొప్పి కార‌ణంగా మూడో రోజు ఆట‌లో గ్రౌండ్‌లోకి దిగ‌లేదు. బుమ్రా కెప్టెన్సీలో తన మార్క్‌ను చూపిస్తూ… కొత్తబంతిని రవిచంద్రన్ అశ్విన్‌తో పంచుకున్నాడు. అయితే బుమ్రా వ్యూహం ఫలించింది. అశ్విన్ త‌న తొలి ఓవర్‌లోనే బెన్ డకెట్‌ (2; 5 బంతుల్లో) క్లీన్‌బౌల్డ్ చేశాడు. కాసేపటికే జాక్ క్రాలే (1; 16 బంతుల్లో) బోల్తాకొట్టించి ఔట్ చేశాడు.. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.ఆ త‌ర్వాత ఓలీ పోప్ 19 పరుగులు, జానీ బెయిర్ స్టో 39 పరుగులు, బెన్ స్టోక్స్ 2 పరుగులు,ఫోక్స్ 8 ప‌రుగులు, హార్ట్‌లీ 20 ప‌రుగులు,ఉడ్ డకౌట్, బ‌షీర్ 13 ప‌రుగులు చేశారు.

అయితే ఒక‌వైపు వికెట్స్ ప‌డుఉత‌న్నా కూడా రూట్(84) మాత్రం నిల‌క‌డ‌గా బ్యాటింగ్ చేశాడు. అర్ధ‌సెంచ‌రీ వ‌ర‌కు నెమ్మదిగా ఆడిన రూట్ త‌ర్వాత కాస్త స్పీడ్ పెంచాడు. అయితే భారీ షాట్‌కి ప్ర‌య‌త్నించిన క్ర‌మంలోబుమ్రాకి క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.ఈ క్ర‌మంలో భార‌త్ 64 ప‌రుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఇక తన 100వ టెస్టు ఆడిన భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ‌రోసారి అద్భుత‌మైన బౌలింగ్ తో 5 టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, బుమ్రా రెండు వికెట్లు, జ‌డేజా ఒక వికెట్ తీసుకున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 ప‌రుగుల‌కి ఆలౌట్ కాగా, భార‌త్ తొలి ఇన్పింగ్స్‌లో 477 ప‌రుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 195 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు రోహిత్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టని నేప‌థ్యంలో అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఈ క్రమంలో వెన్నునొప్పితో బాధపడుతున్నాడనే విషయాన్ని బీసీసీ తెలిపింది. మ‌రి కొద్ది రోజుల‌లో ఐపీఎల్‌ పోరు ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడనే విషయం విని ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.