వాట్ ఏ మ్యాచ్.. మంచి మ‌జా అందించిన రాంచీ మ్యాచ్.. సిరీస్ భార‌త్‌కే..!

వాట్ ఏ మ్యాచ్.. మంచి మ‌జా అందించిన రాంచీ మ్యాచ్.. సిరీస్ భార‌త్‌కే..!

ఇటీవ‌లి కాలంలో టెస్ట్ మ్యాచ్‌లు కూడా మంచి మ‌జా అందిస్తున్నాయి. రెండు పెద్ద జ‌ట్లు త‌ల‌పడితే క్రికెట్ ప్రేమికుల‌కి కావల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ ద‌క్క‌డం ఖాయం. ప్ర‌స్తుతం భార‌త్‌- ఇంగ్లండ్ మ‌ధ్య టెస్ట్ సిరీస్ న‌డుస్తుంది. ఐదు టెస్ట్‌ల మ్యాచ్‌లో భాగంగా రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్ విజ‌యం సాధించ‌గా, రెండు, మూడు టెస్ట్‌లు భార‌త్ గెలుచుకుంది. అయితే రాంచీ వేదికగా జరురిగిన‌ నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగింది. చివ‌రి వ‌ర‌కు కూడా విజ‌యం ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగానే సాగింది. రాంచీ వికెట్ అంత సులువుగా లేక‌పోవ‌డం వ‌ల‌న ఇంగ్లండ్ స్పిన్నర్లు గిరగిర తిరిగే బంతుల్ని సంధిస్తూ భార‌త్‌కి స‌వాల్ విసిరారు.

త‌క్కువ టార్గెట్ భార‌త్ క‌ళ్ల ముందు ఉన్నా కూడా భార‌త్ దానిని చేజ్ చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డింది. మూడో రోజు భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా న‌ల‌బై పరుగులు చేయ‌గా, నాలుగో రోజు 84 ప‌రుగులు చేశారు య‌శ‌స్వి జైస్వాల్- రోహిత్ జోడి. అయితే ఆటలో జో రూట్ తొలి బంతిని ఎదుర్కొన్న యశస్వీ జైస్వాల్ (37; 44 బంతుల్లో) అండర్సన్ అద్భుత క్యాచ్‌తో పెవీలియ‌న్ చేరాడు. ఇక టామ్ హర్ట్‌లీ వేసిన బంతిని రోహిత్ శర్మ అంచనా వేయడంలో విఫ‌లం కావ‌డంతో 55 ప‌రుగుల‌కి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పటిదార్ షోయబ్ బషీర్ వేసిన వలలో చిక్కుకొని డ‌కౌట్‌గా వెనుదిరిఆడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన రవీంద్ర జడేజా (4; 33 బంతుల్లో) పరుగుల మీద కంటే వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చాడు.

అయితే బ‌షీర్ వేసిన బంతికి ఔట్ కాక త‌ప్ప‌లేదు. ఇక స‌ర్ఫరాజ్ ఖాన్(0) ఎదుర్కొన్న తొలి బంతికే బషీర్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.120కి ఐదు వికెట్లు ప‌డ‌డంతో భార‌త్ ఒత్తిడిలో ప‌డింది. అయితే శుభ్ మ‌న్ గిల్(52 నాటౌట్ ) కీప‌ర్ జురేల్‌తో(39 నాటౌట్)క‌లిసి అద్భుత‌మైన భాగ‌స్వామం నెల‌కొల్పాడు. ఆచితూచి ఆడుతూ టార్గెట్‌ని పూర్తి చేశారు. దీంతో భార‌త్ ఖాతాలో మ‌రో విజ‌యం చేర‌డంతో పాటు సిరీస్ కూడా ద‌క్కింది. ఇక ఇంగ్లండ్ బౌల‌ర్స్‌లో బ‌షీర్ కీల‌క‌మైన మూడు వికెట్స్ తీయ‌గా హార్ట్‌లీ ఒక‌టి, రూట్ ఒక వికెట్ ద‌క్కించుకున్నారు. ఏదేమైన రాంచీ మ్యాచ్ మాత్రం క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించింది. చివ‌రి వ‌ర‌కు గెలుపు దోబూచులాడుతూ క్రికెట్ చూసే వారిని కాస్త టెన్ష‌న్‌కి గురి చేసింది.  ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి మొద‌ట ఇన్నింగ్స్‌లో 353 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 145 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 307 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం ఐదు వికెట్లు కోల్పొయి విజ‌య‌లాంచ‌నం పూర్తి చేసింది.