ఐపీఎల్‌పై పార్లమెంటు ఎన్నికల ఎఫెక్ట్? జై షా ఏమంటున్నారు?
లోక్‌సభ ఎన్నికలపై ఈసీ ప్రకటన చేసిన తర్వాతే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పారు.

వన్డే వరల్డ్ కప్ సమరం ముగిసింది. ఇక ఇప్పుడు క్రికెట్ ప్రియులు అంతా కూడా ధనాధన్ క్రికెట్ ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని తెలుస్తుండగా, ఆయన ఆడే ప్రతి మ్యాచ్‌పై చాలా ఆసక్తి నెలకొని ఉంటుంది. అయితే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2024 సీజన్ పై ఏమైన ఎఫెక్ట్ ఉంటుందా, ఉంటే కనుక ఐపీఎల్‌ని వేరే దేశంలో నిర్వహిస్తారా అని అనేక సందేహాలు జనాలలో ఉన్నాయి. తాజాగా ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ సెక్రటరీ జే షా కీలక అప్డేట్ ఇచ్చారు. ఈసారి ఐపీఎల్ మార్చి నెలాఖరులో ప్రారంభం కానుందని తెలియజేశారు.
ఐపీఎల్ సీజన్ 17 మార్చి చివరిలో ప్రారంభమై మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలోగా పూర్తవుతుందని జై షా చెప్పుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల వలన ఇంకా ఐపీఎల్ తేదిలని ప్రకటించలేదని, ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాతే దానిని బట్టి ఐపీఎల్ షెడ్యూల్ సిద్ధమవుతుంది అని జైషా తెలియజేశారు. దీంతో ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్ ఎన్నికల ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. ఈసారి ఐపీఎల్ వేలం ప్రక్రియ డిసెంబర్ 19న జరగనుంది. దుబాయ్‌లో జరగనున్న ఈ మినీ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా, ప్రస్తుతం 10 జట్లలో ఖాళీల సంఖ్య 77 మాత్రమే ఉంది. ఈ క్రమంలో 77 మంది ఆటగాళ్లకు మాత్రమే ఈసారి ఈసారి ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కనుంది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఒక జట్టులో కనీసం 18 మంది, గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు అనే నిబంధన గురించి తెలిసే ఉంటుంది. ఐపీఎల్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన చాలా మంది ఆటగాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. మరి ఈ ఐపీఎల్‌కి ఎవరెవరు అవకాశం దక్కించుకుంటారు, ఎవరు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు, ఇక చివరి ఐపీఎల్‌లో ధోని ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దానిపై కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ నడుస్తుంది.